గ్రామపంచాయతీ స్థలాలపై వివాదం

by Ratna Kumari |

గోపాల్పేట అయోధ్య నగర్‌లో గ్రామపంచాయతీ స్థలాల విక్రయాల ఆరోపణలపై ప్లాట్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు.

గ్రామపంచాయతీ స్థలాలపై వివాదం
X

దిశ, గోపాల్పేట : వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని అయోధ్య నగర్ వెంచర్‌లో గ్రామపంచాయతీకి కేటాయించిన స్థలాలపై వివాదం నెలకొంది. గ్రామపంచాయతీ స్థలాలకు బై నంబర్లు కేటాయించి విక్రయించారనే ఆరోపణల నేపథ్యంలో, ఆ ప్లాట్లను కొనుగోలు చేసిన ఇద్దరు యజమానులకు గ్రామపంచాయతీ కార్యదర్శి బాలరాజు నోటీసులు జారీ చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 114(8), 268 ప్రకారం గ్రామపంచాయతీ స్థలాన్ని ఆక్రమించినట్లు భావిస్తూ గతంలో మంజూరైన అనుమతులను రద్దు చేస్తున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు.

మండల కేంద్రంలోని పార్కు స్థలాలు, ప్రభుత్వ భూములకు బై నంబర్లు కేటాయించి విక్రయిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీకి చెందిన అసలు స్థలాల వివరాలను బహిర్గతం చేసి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కొంకలి మల్లేష్ జూన్ 16న ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. గ్రామపంచాయతీ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగిస్తానని మల్లేష్ తెలిపారు. ప్రస్తుతం ఈ అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Next Story