- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థుల భద్రత కేవలం నిబంధన కాదు.. నైతిక బాధ్యత: విక్రమ్ సింగ్ మాన్
పాఠశాలల్లో విద్యార్థుల భద్రత యాజమాన్యాల నైతిక బాధ్యత.. రవీంద్రభారతి అవగాహన సదస్సులో అగ్నిమాపక శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ కీలక వ్యాఖ్యలు!

దిశ,తెలంగాణ బ్యూరో: విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రత కేవలం చట్టబద్ధమైన నిబంధన కాదని, తమకు అప్పగించిన ప్రతి చిన్నారి ప్రాణాలను కాపాడాల్సిన నైతిక బాధ్యత యాజమాన్యాల దేనని రాష్ట్ర అగ్నిమాపక, విపత్తు స్పందన శాఖ డీజీ విక్రమ్ సింగ్ మాన్ స్పష్టం చేశారు. పాఠశాలల్లో అగ్నిప్రమాదాల నివారణపై బేసిక్ ఎలిమెంట్స్ సంస్థ సహకారంతో మంగళవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో పాఠశాల యాజమాన్యాలకు భారీ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 500 మందికి పైగా పాఠశాలల యజమానులు, కరస్పాండెంట్లు, ప్రిన్సిపాళ్లు హాజరయ్యారు. గతంలో దేశవ్యాప్తంగా పలు స్కూళ్లు, హాస్టళ్లలో జరిగిన అగ్నిప్రమాదాలను డీజీ ఈ సందర్భంగా కేస్ స్టడీలుగా ప్రదర్శించారు. యాజమాన్యాల నిర్లక్ష్యం, ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్లే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫైర్ సేఫ్టీని ప్రతి పాఠశాల తమ పరిపాలనలో అంతర్భాగం చేసుకోవాలని హితవు పలికారు.
అగ్నిమాపక పరికరాలు ఎల్లప్పుడూ పనిచేసేలా చూసుకోవాలని, విద్యార్థులు, సిబ్బందికి అత్యవసర సమయాల్లో ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో తెలిసేలా క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని సూచించారు. అనంతరం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను విద్యాసంస్థలు తప్పనిసరిగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల పలుచోట్ల జరిగిన ప్రమాదాల దృష్ట్యా ముఖ్యంగా హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించారు. పనిచేసే స్థితిలో ఫైర్ అలారాలు, ఫైర్ డిటెక్టర్లు, అడ్డంకులు లేని ఎమర్జెన్సీ ఎగ్జిట్ మార్గాలు తప్పనిసరిగా ఉండాలని తెలిప్పారు. షార్ట్ సర్క్యూట్‌లు జరగకుండా సురక్షితమైన విద్యుత్ వైరింగ్ ఉండాలన్నారు. తెలంగాణలోని ప్రతి చిన్నారికి సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించేందుకు అగ్నిమాపక శాఖ కట్టుబడి ఉందని, ఇందుకు పాఠశాల యాజమాన్యాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.






