డీపీఎస్ నాచారంలో వ్యోమగామి శుభాన్షు శుక్లా సందడి

by Ratna Kumari |

డీపీఎస్ నాచారంలో విద్యార్థులతో ముచ్చటించిన వ్యోమగామి శుభాన్షు శుక్లా.. పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

డీపీఎస్ నాచారంలో వ్యోమగామి శుభాన్షు శుక్లా సందడి
X

దిశ, నాచారం : ఆత్మవిశ్వాసం, ధైర్యం, కృషితో ముందుకు సాగితే ఆకాశమే హద్దు కాదని భారత వైమానిక దళానికి చెందిన గ్రూప్ కెప్టెన్, ప్రముఖ వ్యోమగామి శుభాన్షు శుక్లా అన్నారు. మంగళవారం నాచారంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన "కాస్మిక్ కన్వర్సేషన్ – విశ్వ సంభాషణ"** కార్యక్రమంలో ఆయన విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా శుభాన్షు శుక్లాకు టీచర్ ఎమ్మెల్సీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్–పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ మల్క కొమరయ్య, సీఈఓ మల్క యశశ్వి, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం డీపీఎస్ నాచారం కేంబ్రిడ్జ్ క్యాంపస్‌లో మొక్క నాటారు. అంతరిక్ష వేషధారణలో వచ్చిన విద్యార్థులు ఆయనకు స్వాగతం పలకడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు శుభాన్షు శుక్లా ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చారు. అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన వీడియోను ప్రదర్శించడంతో పాటు ఆయన రచించిన "ది సెకండ్ ఆర్బిట్" పుస్తకాన్ని ఆవిష్కరించారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ సహకారం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. జీవితంలో లక్ష్యం స్పష్టంగా ఉంటే దాన్ని సాధించకుండా ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. పెద్ద కలలు కనాలని, సానుకూల ఆలోచన, క్రమశిక్షణ, నిరంతర శ్రమతో ముందుకు సాగితే విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. భయాలను వీడి ధైర్యంగా ముందడుగు వేయాలని, "రేపటి దేశ భవిష్యత్ మీరే" అంటూ విద్యార్థులకు పిలుపునిచ్చారు. చైర్మన్ మల్క కొమరయ్య, సీఈఓ మల్క యశశ్వి మాట్లాడుతూ, శుభాన్షు శుక్లా వంటి స్ఫూర్తిదాయక వ్యక్తి తమ పాఠశాలకు రావడం గర్వకారణమన్నారు. విద్యార్థులు పెద్ద లక్ష్యాలతో ముందుకు సాగుతూ "థింక్ బిగ్ – వర్క్ హార్డ్" అనే సూత్రాన్ని ఆచరించాలని సూచించారు. కార్యక్రమం ముగిసిన అనంతరం విద్యార్థులు శుభాన్షు శుక్లా ఆటోగ్రాఫ్‌ల కోసం ఆసక్తిగా తరలివచ్చారు.

Next Story