- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో అంతులేని అవినీతి
శేరిలింగంపల్లి సర్కిల్ 49లో అధికారుల అవినీతి పరాకాష్టకు చేరింది.

దిశ, శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి సర్కిల్ 49లో అధికారుల అవినీతి పరాకాష్టకు చేరింది. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు అంగట్లో సరుకులా మార్చేశారు. నిబంధనలు పాటించలేదని ఏళ్ల క్రితం రిజెక్ట్ అయిన భవనాలకు ఓసీ మంజూరు చేసి కోట్లు అక్రమార్జనకు పాల్పడ్డారు. ఇందుకోసం నమ్మకస్తులైన ప్రత్యేక ముఠా ఏర్పాటు చేశారు. వారి ద్వారా చెప్పినంత పైకం వసూళ్లు చేసి పదుల సంఖ్యలో ఓసిలు జారీ చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. డిప్యూటీ కమిషనర్, ఏసీపి, టి పి ఎస్ పరిధిలోకి వచ్చే ఓసిల జారీలో అవినీతి అధికారుల చేతివాటం ప్రదర్శించారు. అడిగే వారే లేకపోవడంతో రెచ్చిపోయారు. కార్యాలయంలో ఎప్పుడు అందుబాటులో ఉండని అధికారులు పైరవీకారుల కోసం ప్రత్యేక డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచే అక్రమ అనుమతులు, ఓసి లు జారీ చేశారు. అక్రమ నిర్మాణాలు గుర్తించి నోటీసులు జారీ చేసేందుకు ఏర్పాటు చేసిన న్యాక్ ఇంజనీర్లను కార్యాలయం పనుల కోసం వాడుకున్నారు. కేవలం ఉన్నతాధికారులు సమావేశాలు ఉంటేనే కార్యాలయానికి వచ్చి వెళ్లేవారు. మిగతా సమయం అంతా ఫీల్డ్ విజిట్ పేరుతో అక్రమార్కులతో జత కట్టారు.
అధికారుల బరితెగింపు
2017 లో నిబంధన విరుద్ధంగా నిర్మించిన భవనానికి ఓ సి దరఖాస్తు రిజెక్ట్ చేస్తే ఇప్పుడు దానిని ఇప్పుడు రిలీజ్ చేశారు. నాడు అక్రమం ఇప్పుడు సక్రమం ఎలా అయ్యిందో.. బట్టుబడితే పరిణామాలు ఎలా ఉంటాయో తెలిసి లెక్కలేని తనమా?కింద నుంచి పై వరకు ముడుపుల పంపకమా అనే అనుమానాలు కలుగుతున్నాయి.టెలికం నగర్ ప్లాట్ నెంబర్ 279 స్థలానికి 2017 లో స్టిల్ట్ + 3 అనుమతి ఇచ్చారు. నిబంధనల ప్రకారం 2023 ఫిబ్రవరి 6వ తేదీ లోపు భవన నిర్మాణం పనులు పూర్తిచేయలి. ఒక రోజు ముందు అంటే 05/02/2023 నాడు నిర్మాణదారుడు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అప్పటి టౌన్ ప్లానింగ్ అధికారులు భవనాన్ని పరిశీలించి డివియేషన్ చేసి నిర్మాణం చేశారని, 9 మీటర్లుగా ఉండాల్సిన రోడ్డు స్థలంలో కాంపౌండ్ వాల్ నిర్మించారని ఓసి రద్దు చేశారు. సదరు భవనానికి తాజాగా బిల్డ్ నౌ విధానంలో తిరిగి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ రిలీజ్ చేశారు.10 శాతం కంటే ఎక్కువ డివియేషన్ చేసి రోడ్డును ఆక్రమించారని ఓసి రద్దు రిజెక్ట్ చేశారు. గుల్ మోహర్ పార్క్ కాలనీ ప్లాట్ నెంబర్ 465 లోని స్థలానికి 2021లో జీ+1 అనుమతి జారీచేశారు. నిర్మాణదారుడు నిబంధనలకు అనుగుణంగానే భవనం నిర్మించారు. అయితే ఇక్కడ కనివిని ఎరుగని విడ్డూరం జరిగింది.
పర్మిషన్ లోని నిబంధనల ప్రకారం...
ఇక్కడ లేని అంతస్తుకు ఆక్యుపెన్సి సర్టిఫికెట్ జారీ చేశారు. భవిష్యత్తులో అదనపు అంతస్తుకు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి మార్టిగేజ్ చేయాల్సిన అవసరం అంతకంటే రాదు. ప్రభుత్వ ఖజానాకు రావల్సిన ఆదాయానికి గండి కొట్టి తమ జేబులు నింపుకున్నారు. నల్లగండ్ల హుడా కాలని ప్లాట్ నెంబర్ 159లోఅనుమతి వచ్చిన రోజే… ఆక్యుపెన్సీ రద్దు చేశారు. 2022 జూలై 18న గ్రౌండ్ + 2 నిర్మాణానికి అనుమతి ఇచ్చారు. పర్మిషన్ లోని నిబంధనల ప్రకారం 2023 జనవరి 1 లోపు నిర్మాణం ప్రారంభించి, 2025 జూలై 18వ తేదీ లోపు భవన నిర్మాణం పూర్తిచేయలి. ఐతే విచిత్రం ఏమిటంటే అనుమతి జారీ అయిన రోజే అక్యూపెన్సీ సర్టిఫికెట్ రిజెక్ట్ అయింది.అనుమతుల రాకముందే భవన నిర్మాణం పూర్తయినట్ల దరఖాస్తు చేయడం,రిజెక్ట్ చేయడం అంతుచిక్కడం లేదు.. నాలుగేళ్ల క్రితం ఓసి రద్దయిన ఈ భవనానికి 2025 జూన్ 30న భవనం పూర్తయిందని నిర్మాణదారుడు దరఖాస్తు చేశాడు.
ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో...
దరఖాస్తు వచ్చిన సంవత్సరం తర్వాత ఇప్పుడు తిరిగి OC రిలీజ్ చేయడం విడ్డూరం. అనుమతుల కంటే ముందే ఆక్యుపెన్సీకి దరఖాస్తు చేసుకున్న నిర్మాణదారుడుకి ఇంత కాలానికి బేషరతుగా ఓసీ జారీ చేశారంటే ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారుల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. శేరిలింగంపల్లి 49 సర్కిల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో ఇలాంటి చిత్ర విచిత్రాలు కోకొల్లలు. ఇక్కడ టౌన్ ప్లానింగ్ విభాగంలో పెద్ద సంఖ్యలో ఓసీలు జారీ చేసి భారీగా అవినీతికి పాల్పడినట్లు స్పష్టమవుతుంది. అనుమతుల జారీలో భారీ అవకతవకలకు పాల్పడినట్లు ఇటీవల అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించిన చర్యలు లేకపోవడంతో మరింతా బరితెగించారు. ఏసీపీ వెంకటరమణ,డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి విధుల్లో ఉన్న సమయం ఆ తర్వాత జారీచేసిన అనుమతులపై పునః పరిశీలన జరపాలంటూ ఏకంగా ప్రభుత్వానికే సూచించిన పరిస్థితులు మార్పు రాలేదు.






