IND Vs ENG: తడబడుతున్న టీమిండియా.. వెంటవెంటనే రోహిత్, కోహ్లీ అవుట్

by Kema Shiva Kumar |

టీమిండియాతో జరగుతున్న ఫస్ట్ వన్డేలో ఇంగ్లాండ్ 258 పరుగులకే ఆలౌట్ అయింది.

IND Vs ENG: తడబడుతున్న టీమిండియా.. వెంటవెంటనే రోహిత్, కోహ్లీ అవుట్
X

దిశ, వెబ్‌డెస్క్: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో తొలి వన్డేలో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో టీమిండియా తలపడుతోంది. అయితే, తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే, భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హోస్ట్‌లను కట్టడి చేయడంతో పాటు వరుస వికెట్లు తీసి ఇంగ్లాండ్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 259 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ప్రస్తుతం ఇన్నింగ్స్‌ను నిలకడగా కొనసాగిస్తోంది.

రూట్, డాసన్ పోరాటం..

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. కేవలం 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ తీవ్ర కష్టాల్లో పడిన దశలో స్టార్ బ్యాటర్ జో రూట్ (76), లియామ్ డాసన్ (68) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌లతో ఆదుకున్నారు. వీరిద్దరూ 7వ వికెట్‌కు 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోరును అందించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 4 వికెట్లు, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ చెరో 2 వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా, శివమ్ దూబేలకు ఒక్కో వికెట్ దక్కింది. కాగా, వన్డే అరంగేట్రం చేసిన యువ పేసర్ గుర్నూర్ బ్రార్ బౌలింగ్ చేస్తుండగా కండరాల గాయం కారణంగా మైదానాన్ని వీడాడు,

రోహిత్, కోహ్లీ ఫ్లాప్..

259 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (11), విరాట్ కోహ్లీ (5) తక్కువ పరుగులకే జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యారు. 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన దశలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ప్రస్తుతం భారత్ జట్టు 15.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 83 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్ గిల్ (39), శ్రేయస్ అయ్యర్ (19) క్రీజ్‌లో ఉన్నారు. భారత్ విజయం సాధించాలంటే ఇంకా 34 ఓవర్లలో 176 పరుగులు చేయాల్సి ఉంది.

Next Story