తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

by Batti.Sumithra |

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో మంగళవారం రోజు తల్లి, కూతుళ్లు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి
X

దిశ, తాడ్వాయి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో మంగళవారం రోజు తల్లి, కూతుళ్లు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మూడు నెలల క్రితమే కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబంలో, తాజాగా తల్లి, కూతురు మరణించడం స్థానికులను కలచివేసింది.​ గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం చిట్యాల గ్రామానికి చెందిన నరసవ్వ (70) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తల్లి అనారోగ్యంతో ఉందనే విషయం తెలుసుకున్న ధర్మ రావు పేట గ్రామానికి చెందిన కూతురు బాలమణి (40), తన తల్లిని చూసేందుకు పుట్టింటికి వచ్చారు. అయితే, బాలమణి చేరుకున్న కొద్దిసేపటికే నరసవ్వ తుదిశ్వాస విడిచారు.​

తల్లి మరణాన్ని తట్టుకోలేక బాలమణి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ దుఃఖంలో ఉండగానే ఆమెకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆమెను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే బాలమణి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో కుమారుడిని కోల్పోయిన ఆ కుటుంబం, ఇప్పుడు తల్లి, కూతుర్ల మరణంతో కోలుకోలేని దెబ్బతిన్నది. ఒక్కరోజే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో చిట్యాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Next Story