పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తిచేయాలి: పోలీస్ కమిషనర్ సునీల్ దత్

by Kodari Anjali |

పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తిచేసి అభియోగపత్రాన్ని నిర్ణీత గడువులోగా న్యాయస్థానంలో సమర్పించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు.

పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తిచేయాలి: పోలీస్ కమిషనర్ సునీల్ దత్
X

దిశ, ఖమ్మం క్రైం: పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగవంతంగా పూర్తిచేసి అభియోగపత్రాన్ని నిర్ణీత గడువులోగా న్యాయస్థానంలో సమర్పించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీస్ అధికారుల నేరసమీక్ష సమావేశం పోలీస్ కాన్ఫిరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ...నేర విచారణలో నిందితులకు శిక్షల శాతం పెరగడం అత్యంత ముఖ్యమని, దీనికోసం పకడ్బందీ దర్యాప్తు, శాస్త్రీయ ఆధారాల సేకరణ, పోలీసు-ప్రాసిక్యూషన్ సమన్వయం అవసరమన్నారు. కొత్త చట్టాల ప్రకారం నిర్ణీత గడువులోగా ట్రయల్ పూర్తి చేయాలని, సాక్షులు భయపడకుండా భరోసా కల్పిస్తూ... న్యాయస్థానానికి హాజరయ్యేలా చూడాలన్నారు. ఎన్డీపీఎస్ కేసులో న్యాయస్థానంలో నేరాన్ని రుజువు చేయడానికి ఆయా కేసుల్లో స్వాధీనం చేసుకున్న గంజాయి, మాదకద్రవ్యాల స్వభావం, పరిమాణాన్ని శాస్త్రీయంగా నిర్ధారించే ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటరీ నివేదిక ప్రధాన ఆధారమని అన్నారు. అదేవిదంగా జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలను అరికట్టడానికి స్పెషల్ దృష్టి పెట్టాలని, ఈగల్ బృందాలు, టాస్క్ ఫోర్స్, స్థానిక పోలీసుల సమన్వయంతో మూలలను కనిపెట్టాలని అన్నారు.

రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని...

వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిఘా వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. చోరీల నివారణకు, దొంగిలించబడిన సొత్తును బాధితులకు తిరిగి అప్పగించడానికి పోలీసులు సాంకేతికతను ఉపయోగిస్తూ రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, నిందితుల గుర్తింపు, రికవరీ వేగవంతం చెయాలన్నారు. విచారణలో భాగంగా ప్రతి కేసును సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్‌ సాక్ష్యాలు, డిజిటల్‌ సాక్ష్యాలను సమర్థవంతంగా వినియోగించి దర్యాప్తు చేపట్టాలని సూచించారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ... నేరాలు జరిగిన తరువాత స్పందించడం కంటే..ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడమే సమర్థవంతమైన పోలీసింగ్‌ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

ప్రాణనష్టాన్ని నివారించడానికి...

శాంతిభద్రతలు,నేరాల ధోరణి, పోలీస్‌ స్టేషన్ల పనితీరు, పెండింగ్‌ కేసులు, దర్యాప్తు పురోగతి, ట్రాఫిక్‌ నియంత్రణ, సైబర్‌ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్‌, పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే హాట్‌స్పాట్‌లు లేదా బ్లాక్ స్పాట్‌లలో ప్రాణనష్టాన్ని నివారించడానికి రోడ్డు భద్రతా చర్యలు, ఇంజనీరింగ్ మార్పులు, కఠినమైన ట్రాఫిక్ నియంత్రణలు చాలా ముఖ్యమన్నారు.ప్రమాదకర మలుపులు, కూడళ్ల వద్ద స్పష్టమైన సైన్‌బోర్డులు, బ్లింకర్స్, స్పీడ్ బ్రేకర్లు, రంబిల్ స్ట్రిప్స్, గరిష్ఠ వేగపరిమితి సూచికలు పెట్టడం, రాత్రి సమయంలో స్పష్టత కోసం సోలార్ లైట్లు, వీధి దీపాలు మెరుగుపరచడం. గుంతలను పూడ్చడం, జారుడు రోడ్లకు తగిన గుర్తులు వేయడం వంటి చర్యలు సంబంధిత అధికారుల సమన్వయంతో ఏర్పాటు చేయాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు వసుందర యాదవ్, రమణమూర్తి, తిరుపతి రెడ్డి, సారంగపాణి, ఫణిందర్,నర్సింహారావు, సర్వర్, సత్యనారాయణ, సాంబరాజు పాల్గొన్నారు.

Next Story