- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
DGFT: ఫోర్స్డ్ లేబర్ ద్వారా తయారైన ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన భారత్
ఈ నిబంధనలు అధికారిక గెజెట్‌లో ప్రచురించిన 30 రోజుల తర్వాత అమల్లోకి రానున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: బలవంతపు కార్మికులతో తయారైన వస్తువుల దిగుమతులపై భారత్ కఠిన వైఖరి తీసుకుంది. విదేశీ వాణిజ్య విధానం (ఎఫ్‌టీపీ)–2023ని సవరిస్తూ, అలాంటి ఉత్పత్తుల దిగుమతిని నిషేధించే కొత్త నిబంధనను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారీన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, పూర్తిగా లేదా పాక్షికంగా బలవంతపు శ్రమతో తయారైనట్లు తేలిన వస్తువులను ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా నిషేధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఈ నిబంధనలు అధికారిక గెజెట్‌లో ప్రచురించిన 30 రోజుల తర్వాత అమల్లోకి రానున్నాయి. భారత్ వాణిజ్య విధానాన్ని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రమాణాలకు అనుగుణంగా తీసుకురావడంతో పాటు, బలవంతపు కార్మికుల వినియోగంపై అమెరికా వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు కూడా ఈ నిర్ణయం సమాధానంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి అంశాలపై అమెరికా విచారణ జరుపుతున్న దేశాల్లో భారత్ కూడా ఉంది. ఇప్పటికే అమెరికా మార్కెట్‌కు వెళ్లే చాలా భారతీయ ఉత్పత్తులపై 10 శాతం సుంకం అమల్లో ఉండగా, కొన్ని విభాగాలు అదనపు సుంకాల పరిశీలనను కూడా ఎదుర్కొంటున్నాయి.
కొత్తగా చేర్చిన ఎఫ్‌టీపీ పేరా 2.20బీ ప్రకారం, దిగుమతి చేసే వస్తువులు బలవంతపు శ్రమతో తయారయ్యాయా లేదా అనే అంశాన్ని డీజీఎఫ్‌టీ విచారిస్తుంది. తగిన ఆధారాలు లభిస్తే, ఆ ఉత్పత్తులను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు. ఈ విచారణ హ్యాండ్‌బుక్ ఆఫ్ ప్రొసీజర్స్–2023లోని నిబంధనల ప్రకారం నిర్వహిస్తారు. అలాగే, 1930 నాటి ఐఎల్ఓ ఫోర్స్డ్ లేబర్ కన్వెన్షన్‌లోని నిర్వచనాన్నే భారత్ స్వీకరించింది. దాని ప్రకారం, శిక్ష భయంతో ఒక వ్యక్తి స్వచ్ఛందంగా అంగీకరించకుండా చేయించే ఏ పని లేదా సేవనైనా 'బలవంతపు శ్రమ'గా పరిగణిస్తారు. ఈ నిర్ణయంతో గ్లోబల్ సప్లై చైన్‌లో నైతిక ప్రమాణాలను బలోపేతం చేయడంతో పాటు, అంతర్జాతీయ వాణిజ్య భాగస్వాముల విశ్వాసాన్ని పెంచే దిశగా భారత్ మరో కీలక అడుగు వేసినట్టుగా భావిస్తున్నారు.






