- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళా సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాది: మల్కాజిగిరి సీపీ
మహిళా సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాదని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అన్నారు.

దిశ, చైతన్యపురి: మహిళా సాధికారత సమాజ భద్రతకు బలమైన పునాదని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి అన్నారు. నాగోల్ లో ఏర్పాటు చేసిన మీ సురక్ష సహచరి కార్యక్రమాన్ని మంగళవారం సీపీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. స్వయం సహాయక సంఘాల మహిళలను కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా తీర్చిదిద్దుతూ చట్టాలపై అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో భద్రమైన సురక్షితమైన సమాజ నిర్మాణమే కార్యక్రమం ముఖ్యలక్ష్యమని పేర్కొన్నారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్, ఎంఈ పిఎంఎఎస్ ఈ ఆర్ పి సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన వినూత్న కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమం సహచరి ను నాగోల్ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ మహమ్మద్ మక్బూల్ జానీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎల్బినగర్, ఉప్పల్ జోన్లకు చెందిన సుమారు మూడు వేల మంది స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సుమతి మాట్లాడుతూ మహిళలు ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలీసులను సంప్రదించి తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.
కుటుంబం సురక్షితంగా ఉంటే..
కాలనీలు, బస్తీల స్థాయిలో మహిళలు కమ్యూనిటీ సేఫ్టీ అంబాసిడర్లుగా పనిచేస్తే నేరాలను సకాలంలో గుర్తించడం, మహిళలు, పిల్లల భద్రతను మరింత పటిష్ఠం చేయడం సాధ్యమవుతుందన్నారు. మహిళ సురక్షితంగా ఉంటే కుటుంబం సురక్షితం కుటుంబం సురక్షితంగా ఉంటే సమాజం సురక్షితం అనే సందేశాన్ని ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మహిళలకు చట్టపరమైన హక్కులు, వ్యక్తిగత భద్రత, మహిళలు, పిల్లల రక్షణ, సైబర్ నేరాల నివారణ, మాదకద్రవ్యాల ప్రమాదాలు, అత్యవసర సేవలు, పోక్సో, ఎన్‌డీపీఎస్ చట్టాలు, కమ్యూనిటీ పోలీసింగ్, భారోసా సెంటర్లు, షీ టీమ్స్, మహిళా పోలీస్ స్టేషన్లు తదితర అంశాలపై విస్తృత అవగాహన కల్పించారు. కౌన్సెలింగ్, న్యాయ సహాయం, పునరావాసం, దర్యాప్తు సేవల గురించి వివరించారు. ఎం ఈ పిఎంఏ అదనపు మిషన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. యాదగిరిరావు మాట్లాడుతూ, ప్రతి నెల జరిగే స్వయం సహాయక మహిళా సంఘాల సమావేశాల్లో భద్రత అంశాలను చర్చించి, ఈ కార్యక్రమం ద్వారా పొందిన అవగాహనను మరింత మంది మహిళలకు చేరవేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బినగర్, ఉప్పల్, మల్కాజిగిరి జోన్ డీసీపీ లు అనురాధ, కె. సురేష్ కుమార్, శ్రీధర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.






