- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సన్ ఫార్మా, సిప్లా మెడిసిన్ రీకాల్.. రీజన్ ఇదే
భారత ఫార్మా దిగ్గజాలు సన్ ఫార్మా, సిప్లా.. అమెరికాలో తమ ఔషధాలను రీకాల్ చేశాయి. ఇందుకు ప్రధాన కారణం తయారీ లోపాలే అని తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత ఫార్మా దిగ్గజాలు సన్ ఫార్మా, సిప్లా.. అమెరికాలో తమ ఔషధాలను రీకాల్ చేశాయి. ఇందుకు ప్రధాన కారణం తయారీ లోపాలే అని తెలుస్తోంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (USFDA) విడుదల చేసిన తాజా ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్‌లో ఈ విషయం వెల్లడైంది. ముంబై కేంద్రంగా పనిచేస్తున్న సన్ ఫార్మా అమెరికా విభాగం, చర్మ వ్యాధులు, డ్యాండ్రఫ్ చికిత్సకు ఉపయోగించే ఒక జెనరిక్ మందుకు సంబంధించిన 26 వేలకుపైగా బాటిళ్లను రీకాల్ చేసింది.
న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ కేంద్రంగా పనిచేస్తున్న Sun Pharmaceutical Industries Inc సంస్థ.. ఫ్లూసినోలోన్ అసిటోనైడ్ టాపికల్ సొల్యూషన్ (Fluocinolone Acetonide Solution) కు చెందిన 24,624 బాటిళ్లను వెనక్కి పిలిపించింది. ఈ మందులో మలినాలు, డిగ్రడేషన్ సమస్యలు ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు USFDA తెలిపింది.
డిసెంబర్ 30, 2025న దేశవ్యాప్తంగా (అమెరికా అంతటా) ఈ క్లాస్–III రీకాల్ ప్రారంభించినట్టు వెల్లడించింది. క్లాస్–III రీకాల్ అంటే ఈ మందు వాడకంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని అర్థం. అదేవిధంగా.. మొటిమల (Acne vulgaris) చికిత్సకు ఉపయోగించే క్లిండమైసిన్ ఫాస్ఫేట్ యూఎస్పీ మందుకు సంబంధించిన కొన్ని బ్యాచ్‌లను కూడా సన్ ఫార్మా వెనక్కి పిలిపించింది. మొత్తం మలినాల స్థాయి, అస్సే ప్రమాణాలు నిర్దేశిత పరిమితులను మించడంతో నవంబర్ 26, 2025న ఈ రీకాల్ చేపట్టినట్టు USFDA తెలిపింది.
ఇక మరోవైపు, ముంబైకి చెందిన మరో ఫార్మా సంస్థ సిప్లా అమెరికా విభాగం కూడా ఔషధాలను రీకాల్ చేసింది. న్యూజెర్సీలోని వారెన్ కేంద్రంగా పనిచేస్తున్న Cipla USA, Inc సంస్థ Lanreotide Injection (120 mg/0.5 mL) కు సంబంధించిన 15,221 ప్రీ-ఫిల్డ్ సిరంజీలను వెనక్కి పిలిపించింది. ఈ మందులో విదేశీ కణాలు (Particulate matter) ఉన్నట్టు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు USFDA వెల్లడించింది. జనవరి 2న ఈ రీకాల్ ప్రారంభించగా.. దీనిని క్లాస్–II రీకాల్గా వర్గీకరించారు. క్లాస్–II రీకాల్ అంటే ఈ మందు వాడితే తాత్కాలికంగా లేదా చికిత్సతో తగ్గిపోయే ఆరోగ్య సమస్యలు రావచ్చని అర్థం. ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ మార్కెట్‌గా ఉన్న అమెరికాలో ఇలాంటి రీకాల్ ఘటనలు ఫార్మా కంపెనీలకు ప్రతిష్ఠకు సవాలుగా మారుతున్నాయి.






