కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ.. ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు

by Prasad Jukanti |   (  Updated:2026-07-20 11:33:36  IST  )

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. మూడు ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచారు.

కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ ప్రతినిధుల భేటీ.. ప్రభుత్వం ముందు కీలక డిమాండ్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళన కారులపై పోలీసుల లాఠీ చార్జి చేయడంతో పరిస్థితి అట్టుడుకిపోతోంది. ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగా మరోవైపు ఆందోళన కారులు పార్లమెంట్ వైపు దూసుకురావడంతో నిరసన కారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జీతో పాటు టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనలు కొనసాగుతున్న తరుణంలోనే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోశ్ రంకా కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు.

ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు:

కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో భేటీ అనంతరం సీజేపీ ప్రతినిధి అశుతోష్ రంకా మీడియాతో మాట్లాడుతూ ఇవాళ మధ్యాహ్నం మధ్యాహ్నం 2:15 గంటలకు మంత్రి నడ్డా మమ్మల్ని కలిశారని ఈ సందర్భంగా మేము ఆయన ముందు మూడు ముఖ్యమైన డిమాండ్లను ఉంచామని చెప్పారు. అందులో మొదటిది సోనమ్ వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేసి వీడియో సందేశం ద్వారా ప్రజలను ఉద్దేశించి మాట్లాడేందుకు ఆయనకు అనుమతి ఇవ్వాలి. అసమర్థుడైన విద్యాశాఖ మంత్రిగా మేము భావిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తప్పించాలి లేదా ఆయన రాజీనామాను ఆమోదించాలి. నీట్ (NEET) పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకుని మరణించిన విద్యార్థుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలనే డిమాండ్లతో కూడిన లేఖను నడ్డాకు అందజేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో రెండు విడతలుగా చర్చలు జరిగాయని మొదటిది మధ్యాహ్నం 2 గంటలకు, రెండవది సాయంత్రం 4 గంటలకు జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ డిమాండ్లపై పార్టీ అగ్రనాయకత్వంతో చర్చించి, వారి నిర్ణయాన్ని తెలియజేస్తామని నడ్డా తమకు చెప్పినట్లు వెల్లడించారు.

Next Story