- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత్తులోనే డ్రైవింగ్.. ప్రశ్నార్థకమవుతున్న ప్రాణాలు
మద్యం తాగి వాహనాలు నడుపుతూ తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిలో చాలా మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : మద్యం తాగి వాహనాలు నడుపుతూ తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్న వారిలో చాలా మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. దీనివల్ల ఎన్నో కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ పరిస్థితిని నియంత్రించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి పోలీస్ శాఖ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను సీరియస్‌గా తీసుకుంది. జిల్లా అంతటా ప్రతిరోజు ఆకస్మిక సోదాలు ముమ్మరం చేసింది. మద్యం తాగి వాహనం నడిపితే విధించే జరిమానాను అమాంతంగా రూ.10 వేలకు పెంచింది. ఒకసారి తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వ్యక్తి రెండోసారి కూడా దొరికితే నేరుగా జైలుకే పంపుతున్నారు. ఈ విషయంలో పోలీస్ శాఖ ఎవరినీ వదలడం లేదు. వ్యక్తిగత, వృత్తిపరమైన పరిచయాలు ఉన్న వారైనా సరే నిక్కచ్చిగా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో మునుపటి కంటే కేసులు తగ్గినప్పటికీ, ఆశించిన స్థాయిలో మార్పు రాలేదని పోలీసులు చెబుతున్నారు.
జరిమానా కడుతున్నా.. అలవాటు మార్చుకోవడం లేదు..
మద్యం మత్తులో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురైతే కుటుంబాలు ఎలా రోడ్డున పడతాయో కళాజాతల ద్వారా గ్రామాల్లో చైతన్యం కలిగిస్తున్నా కొందరిలో మార్పు రావడం లేదు. కుటుంబ బాధ్యతలు ఉన్న వ్యక్తులు సైతం మద్యం సేవించి కార్లు, బైక్‌లు నడుపుతూ పట్టుబడుతున్నారు. రూ.10వేల జరిమానా విధిస్తున్నా ఆ డబ్బులు కట్టేస్తున్నారే తప్ప తాగి వాహనాలు నడపడం మానడం లేదని కేసుల సరళిని బట్టి అర్థమవుతుంది. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య జిల్లాలోని ఏ పోలీస్ స్టేషన్ తనిఖీలకు వెళ్లినా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కఠినంగా ఉండాలని సిబ్బందిని ఆదేశిస్తున్నారు.
మూడు వారాల్లో రూ.52 లక్షలు జరిమానా..
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ లతోపాటు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో జూన్ 29 నుంచి జూలై 17 వరకు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ మూడు వారాల ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులు 559 కేసులు నమోదు చేశారు. పట్టుబడిన వారిలో 31 మందికి కోర్టు వారం రోజుల జైలు శిక్ష విధించగా.. మిగతా వారికి రూ.52.80లక్షల జరిమానా విధించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పోతరాజు సాయి చైతన్య వెల్లడించారు.
చట్టాలు కఠినం.. అన్నీ నష్టాలే...
మద్యం సేవించి వాహనం నడిపితే అన్నీ నష్టాలే తప్ప ఎలాంటి లాభం లేదని సీపీ సాయి చైతన్య జిల్లా ప్రజలకు సూచిస్తున్నారు. మొదటిసారి పట్టుబడితే రూ.10వేల జరిమానా, ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా రెండూ విధించవచ్చు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌ను 6నెలల పాటు సస్పెండ్ చేస్తారు. రెండోసారి పట్టుబడితే రూ.15 వేల జరిమానా లేదా జైలు శిక్ష లేదా రెండు శిక్షలు పడే అవకాశం ఉంది. మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురైతే ఎలాంటి బీమా ప్రయోజనాలు లభించవు. మైనర్లు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే సదరు మైనర్‌తోపాటు ఆ వాహన యజమానిపై కూడా ఛార్జ్‌షీట్ నమోదు చేసి జైలుకు పంపుతారు. మద్యం సేవించి వాహనాలు నడిపే సంస్కృతిని నియంత్రించి, అమాయకుల ప్రాణాలను కాపాడాలనేదే మా ఏకైక ప్రయత్నం. - పి.సాయి చైతన్య, పోలీస్ కమిషనర్, నిజామాబాద్






