- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆయిల్ పామ్ సాగుతోనే రైతులకు స్థిరమైన ఆదాయం
ప్రతికూల పరిస్థితులను తట్టుకుని రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే ఉద్యాన పంటల్లో ఆయిల్ పామ్ సాగు ఉత్తమ ప్రత్యామ్నాయమని రాష్ట్ర ఉప మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

దిశ, కొణిజర్ల : వాతావరణ మార్పులు, ప్రతికూల పరిస్థితులను తట్టుకుని రైతులకు స్థిరమైన ఆదాయాన్ని అందించే ఉద్యాన పంటల్లో ఆయిల్ పామ్ సాగు ఉత్తమ ప్రత్యామ్నాయమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ, ఉద్యానవన, పట్టు పరిశ్రమల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో ప్రముఖ మల్టీనేషనల్ సంస్థ **గోద్రేజ్ ఆగ్రోవెట్** ఆధ్వర్యంలో 113.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్‌ను సోమవారం వారు ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆయిల్ పామ్ సాగులో అగ్రస్థానంలో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలు పనిచేస్తుండగా, మరో ఆరు ఫ్యాక్టరీల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఈ ఇంటిగ్రేటెడ్ ఆయిల్ పామ్ కాంప్లెక్స్ ఏర్పాటు కావడం రైతులకు ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.
ఈ కేంద్రంలో సీడ్ గార్డెన్‌తో పాటు రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు, సూచనలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా, తెలంగాణలోనే మూడు లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారని, ఖమ్మం జిల్లాలో సుమారు 15 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ పంట సాగవుతోందని వివరించారు. దేశవ్యాప్తంగా 70 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తే దేశం వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఎల్‌నినో వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులను కూడా ఈ పంట తట్టుకుంటుందని, రైతులు ఆయిల్ పామ్ సాగుపై మరింత ఆసక్తి చూపాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ఒక్కో ఎకరానికి రూ.49 వేల సబ్సిడీ అందిస్తోందని, మార్కెటింగ్ సౌకర్యం కూడా ఉండటంతో రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకునే స్థాయి నుంచి, తెలంగాణలోని కొణిజర్ల మండలం నుంచి ఆయిల్ పామ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 700 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంబడిపూడి కమల, స్థానిక ఎమ్మెల్యే రామ్‌దాస్ నాయక్, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, గోద్రేజ్ ఆగ్రోవెట్ ఎండీ & సీఈఓ సునీల్ కఠారియా, గోద్రేజ్ సంస్థల చైర్‌పర్సన్ నదిర్ బి. గోద్రేజ్, తహసీల్దార్ ఎన్. అరుణ, వ్యవసాయ అధికారి బాలాజీ, వేర్‌హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.






