- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘దిత్వా తుఫాన్’ శ్రీలంక అతలాకుతలం.. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం
దిత్వా తుఫాన్ కారణంగా ఇప్పటి వరకు 123 మంది మరణించగా, మరికొందరు గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం (DMC) తెలిపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీలంకపై దిత్వా తుఫాన్ విరుచుకుపడింది. ప్రళయాన్ని తలపించేలా కురిసిన వర్షాలు, ఉద్ధృత ప్రవాహాల కారణంగా ఇప్పటి వరకు 123 మంది మరణించగా, మరికొందరు గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం (DMC) తెలిపింది. మరణాల సంఖ్య పెరిగే అవకాశముందనే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. తుఫాన్ ధాటికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.
ముఖ్యంగా కెలాని నది ఉధృతంగా పొంగిపొర్లడంతో పలు పట్టణాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. 43 వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని డీఎంసీ జనరల్ డైరెక్టర్ సంపత్ తెలిపారు. ఇంకా అనేక ప్రాంతాల్లో రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, రోడ్డు మార్గాలు తెగిపోవడంతో సహాయక చర్యలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, శనివారం శ్రీలంకను ఛేదించిన దిత్వా (Cyclone Ditwah) తుఫాన్ భారత దిశగా కదులుతోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని శ్రీలంకకు భారత్ సహాయ హస్తం చాచి ‘ఆపరేషన్ సాగర్ బంధు’ ప్రారంభించిన విషయం తెలిసిందే. వైమానిక దళం అత్యవసర వస్తువులు, వైద్య సహాయ సామగ్రి, రక్షణ బృందాలను పంపిస్తోంది. పొరుగుదేశం కష్టాల్లో ఉన్న వేళ భారత్ ఇస్తున్న ఈ తక్షణ సాయంపై ప్రభుత్వం స్పందించింది. తుఫాన్ దెబ్బకు మౌలిక సదుపాయాలు, రవాణా వ్యవస్థ దెబ్బతిన్న నేపథ్యంలో శ్రీలంక ప్రస్తుతం అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది.






