యుద్ధానికి బ్రేకులు.. ఇరాన్ షాకింగ్ ప్ర‌క‌ట‌న‌

by velandi.Saikiran |   (  Updated:2026-03-23 23:16:01  IST  )

పశ్చిమాసియా యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ఇచ్చారు. ఇరాన్‌తో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని, రెండ్రోజులుగా జరిగిన ఈ చర్చల కారణంగా ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు.

యుద్ధానికి బ్రేకులు.. ఇరాన్ షాకింగ్ ప్ర‌క‌ట‌న‌
X

యుద్ధానికి బ్రేకులు

- ఐదు రోజులు దాడులు నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన

- ఇరాన్‌తో నిర్మాణాత్మక చర్చల వల్లనేనని వివరణ

- అసలు చర్చలే జరగలేదు.. ట్రంప్‌ను నమ్మలేం: ఇరాన్

దిశ, నేషనల్ బ్యూరో : పశ్చిమాసియా యుద్ధానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరామం ఇచ్చారు. ఇరాన్‌తో నిర్మాణాత్మక చర్చలు జరుగుతున్నాయని, రెండ్రోజులుగా జరిగిన ఈ చర్చల కారణంగా ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని ఆయన ప్రకటించారు. 48 గంటల్లో హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామని హెచ్చరించిన ఆయన.. 24 గంటలు తిరిగేసరికి యుద్ధాన్ని ఆపేయడం గమనార్హం. అయితే ఈ చర్చలు సఫలమై యుద్ధం ఆగితే ప్రపంచ చమురు ధరలు సర్దుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు. అలాగే పశ్చిమాసియాలో శాంతి దిశగా ఇదే తొలి అడుగు అని అంటున్నారు. కానీ ఇరాన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. అసలు తాము అమెరికాతో చర్చలే జరపడం లేదని షాకింగ్ ప్రకటన చేసింది. ఒకపక్క ట్రంప్ దాడులు చేయబోమని ప్రకటించిన తర్వాత కూడా ఇజ్రాయెల్ వెనక్కు తగ్గలేదు. మిలిటరీ స్థావరాలే లక్ష్యంగా ఇరాన్‌లో పలుచోట్ల తాము దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇదే సమయంలో తాను అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియోతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడినట్లు భారత విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధంతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రభావం గురించి చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా ఎనర్జీ భద్రతపై ఆందోళన గురించి మాట్లాడానని జైశంకర్ వెల్లడించారు.

ఈసారి డీల్ పక్కా: ట్రంప్

మధ్యప్రాచ్యంలో నెలకొన్న శత్రుత్వానికి పూర్తిస్థాయిలో ముగింపు పలికే లక్ష్యంతో ఈ వారం పొడవునా చర్చలు కొనసాగుతాయని ట్రంప్ వెల్లడించారు. ఈ క్రమంలోనే ఇరాన్‌పై అన్ని సైనిక దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేయాలని ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ వార్’ను తాను ఆదేశించినట్లు ట్రంప్ తెలిపారు. ఇరాన్‌తో చాలా విషయాల్లో ఏకాభిప్రాయం కుదిరిందని, ఇరువర్గాలూ డీల్ చేసుకునేందుకే ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. అణ్వాయుధాలు తయారు చేయబోమని ఇరాన్ ఒప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. ఇరాన్ కూడా శాంతి కోరుకుంటోందని, కాబట్టి ఈసారి కచ్చితంగా డీల్ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఈ చర్చలు విఫలమైతే మాత్రం ఇరాన్‌పై దాడులు ఆపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇరానే తమతో చర్చలకు దిగొచ్చిందని, అయితే ఈ చర్చలతో డీల్ కుదురుతుందనే నమ్మకం తనకు లేదని ట్రంప్ చెప్పారు. తాము చేసిన దాడుల్లో ఇరాన్ ప్రభుత్వ పెద్దలంతా మరణించారన్న ఆయన.. ప్రస్తుతం ఇరాన్‌తో అమెరికాకు ఎలాంటి ముప్పులేదన్నారు. రీజనబుల్‌గా ఉన్న కొందరితో తాము చర్చలు జరుపుతున్నామని, వాళ్లు ఎవరో ఇరాన్‌లో ఉన్న వారికి తెలుసునని, వారిలోనే ఒకరు చాలా అత్యున్నత స్థాయి వ్యక్తి అని చెప్పారు. ఆ వ్యక్తి మోజ్తాబా ఖమేనీ కాదని స్పష్టంచేసిన ట్రంప్.. అసలు ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ ప్రాణాలతో ఉన్నాడో? లేదో కూడా తమకు తెలియదన్నారు.

రాయబారాలు పంపారు..: ఇరాన్

యుద్ధాన్ని తాత్కాలికంగా ఆపడంపై స్పందించిన ఇరాన్.. ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేమని కొట్టి పారేసింది. ఇది ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించే కుట్రగా అభివర్ణించింది. ప్రస్తుతం అమెరికాతో తాము ఎలాంటి చర్చలూ జరపడం లేదని కుండబద్దలు కొట్టింది. సమయం చూసి దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నదని పేర్కొంది. తాము అమెరికాతో చర్చలు మొదలుపెట్టామనే వార్తలు పూర్తిగా అవాస్తవాలని కొట్టిపారేసింది. తమతో చర్చలు జరపాలని ఇతర దేశాలతో యూఎస్ రాయబారాలు పంపిందని తెలియజేసింది. తమ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ ఘాలిబాఫ్‌తో యూఎస్ ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ చర్చలు జరిపారని వచ్చిన వార్తలను కూడా ఇరాన్ పూర్తిగా ఖండించింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి కావాలనే ఇలా ఫేక్ న్యూస్ వ్యాప్తిచేస్తున్నాయని విమర్శించింది. తమ యుద్ధంపై ట్రంప్ ప్రవర్తన ఎలాంటి ప్రభావం చూపబోదని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. తాము ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని స్పష్టంచేసింది. అలాగే ఇజ్రాయెల్‌తోపాటు పశ్చిమాసియాలోని మరో యూఎస్ బేస్‌పై తాము దాడులు చేసినట్లు ప్రకటించింది. కాగా, న్యూక్లియర్ డీల్ చేసుకునేందుకు ఇరాన్, యూఎస్ మధ్య చర్చలు జరుపుతున్న సమయంలోనే సడెన్‌గా యూఎస్ దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2024లో కూడా అమెరికా ఇలాగే చేసిందని ఇరాన్ పలుమార్లు గుర్తుచేసింది. ఇప్పుడు మరోసారి చర్చలకు దిగినట్లు కనిపించినా.. యూఎస్‌ను ఇరాన్ నమ్మడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు.

మధ్యవర్తిత్వానికి ప్రయత్నాలు..

ఇరాన్, యూఎస్ మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు, పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపేందుకు టర్కీ, ఈజిప్ట్, పాకిస్తాన్ దేశాలు సమాయత్తమయ్యాయి. ఇస్లామాబాద్ వేదికగా యూఎస్ తరఫున ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు ఈ దేశాలు ప్రయత్నించాయి. అయితే ఈ ప్రయత్నాలను ఇరాన్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఈ యుద్ధాన్ని మొదలుపెట్టిన యూఎస్.. నేరుగా అమెరికా తమతో చర్చలు జరపాలని ఇరాన్ డిమాండ్ చేసినట్లు సమాచారం. గత రెండ్రోజులుగా ఇరాన్, యూఎస్ మధ్య పాకిస్తాన్, ఈజిప్ట్, టర్కీ సందేశాలను చేరవేస్తూ వచ్చినట్లు నిపుణులు చెప్తున్నారు. వైట్‌హౌస్ ప్రతినిధి విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీతో ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే యూఎస్ తమతో నేరుగా మాట్లాడాలని, మధ్యవర్తుల ద్వారా కాదని ఇరాన్ స్పష్టంచేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో మరోసారి ఒమన్ ఈ చర్చలకు మధ్యవర్తిత్వం చేసేందుకు ముందుకురావడం గమనార్హం.

Next Story