వెంటనే దాడులు ఆపండి.. లేదంటే ఇక అంతే : ఇరాన్‌కు 6 దేశాల సంయుక్త హెచ్చరిక

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-02 13:03:05  IST  )

ఇరాన్ వెంటనే దాడులు ఆపాలని లేదంటే తాము కూడా యుద్ధం ప్రారంభిస్తామని ఆరు గల్ఫ్ దేశాలు సంయుక్తంగా హెచ్చరించాయి.

వెంటనే దాడులు ఆపండి.. లేదంటే ఇక అంతే : ఇరాన్‌కు 6 దేశాల సంయుక్త హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: గత నెల 28న ఇరాన్ పై ఇజ్రాయెల్ - అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో సుప్రీంలీడర్ అలీ ఖమేనీ మరణించడంతో గల్ఫ్ దేశాలపై ఇరాన్ యుద్ధం ప్రకటించింది. అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు మరో ఆరు దేశాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఇరాన్ షియా దేశం కావడం, మిగతా గల్ఫ్ కంట్రీలు దాని వ్యతిరేకంగా ఉండటం, ఖమేనీ మరణాన్ని సెలబ్రేట్ చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

తాజాగా ఇరాన్ నుంచి దాడులను ఎదుర్కొంటున్న ఆరు దేశాల కీలక సంయుక్త ప్రకటన చేశాయి. ఇరాన్ వెంటనే దాడులను ఆపాలని డిమాండ్ చేశాయి. దాడులు ఆపని నేపథ్యంలో తమని తాము రక్షించుకునే హక్కు తమకు ఉందని ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, కువైట్ దేశాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. ఇరాన్ దాడులు ప్రాంతీయ భద్రతకు ఒక తీవ్ర ముప్పులా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఇరాన్ దాడులు ఆపకపోతే తాము కూడా యుద్ధం మొదలుపెట్టాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించాయి.

10 దేశాల్లో నిలిచిపోయిన విమాన సర్వీసులు

కాగా.. ఇరాన్ దాడుల నేపథ్యంలో గల్ఫ్‌ దేశాల్లో గగనతలాలు మూతపడ్డాయి. మొత్తం 10 దేశాల్లో గగనతలం మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇరాన్‌, ఇరాక్‌, బెహ్రయిన్‌, ఇజ్రాయెల్‌, జోర్డాన్‌, కువైట్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, సిరియా, UAE దేశాలలో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలకు విమానాల రాకపోకలు ఆగిపోవడంతో.. భారత్‌ నుంచి అమెరికా, యూరప్‌ దేశాలకు వెళ్లేందుకు ప్రజల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణం చేసే వీలు కూడా కష్టతరం కావడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. భారత్‌ నుంచి పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమెనిస్తాన్‌, ఖజెకిస్తాన్, ఉక్రెయిన్‌ మీదుగా విమాన ప్రయాణం చేసే అవకాశం ఉన్నప్పటికీ.. యుద్ధ తీవ్రత అంతకంతకూ పెరుగుతున్న క్రమంలో అంతర్జాతీయ విమానాల ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాలకు ప్రయాణ ఖర్చు భారీగా పెరుగుతుండటంతో ప్రయాణికులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఉన్నారు. కాగా.. మధ్యాహ్నం నుంచి అబుదాబి నుంచి విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్, ముంబై, కరాచీ, మాస్కే, పారిస్, ఆమ్ స్టర్ డామ్, లండన్ నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి.

Next Story