షాకింగ్ ప్రమాదం.. 3000 కార్లతో నీటలో మునిగిన కార్గోషిప్‌

by Yella Dhawani Reddy |   (  Updated:2025-06-25 06:20:31  IST  )

ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది.

షాకింగ్ ప్రమాదం.. 3000 కార్లతో నీటలో మునిగిన కార్గోషిప్‌
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర పసిఫిక్ మహాసముద్రంలో (North Pacific Ocean) భారీ ప్రమాదం చోటుచేసుకుంది. దాదాపు 3000 కొత్త కార్లతో ప్రయాణిస్తున్న 'మార్నింగ్ మిడాస్‌ (Morning Midas)' అనే భారీ కార్గో నౌక నీటిలో మునిగిపోయింది. కొన్ని వారాల క్రితం ఈ నౌకలో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ కొరియాలోని ఓ పోర్ట్‌ నుంచి మెక్సికోకు (Mexico) కార్లను తరలిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. జూన్‌ 3న ఈ రవాణా నౌకలో అగ్నిప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని యూఎస్ కోస్ట్‌ గార్డ్‌ ప్రతినిధి తెలిపారు. ప్రమాద సమయంలో నౌకలో 22 మంది సిబ్బంది ఉండగా, వారిని ఆ సమయంలో సమీపంలోని మర్చంట్‌ మెరైన్‌ అనే మరో నౌక రక్షించిందన్నారు.

కాగా, ఈ రవాణా నౌకలో మొత్తం 3 వేల కార్లు ఉండగా.. అందులో 800 ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉన్నాయి. ఓడకు వెనక భాగంలో ఎక్కువగా ఎలక్ట్రిక్‌ వాహనాలు ఉండటంతో పెద్దమొత్తంలో పొగలు కనిపించాయని ప్రమాద సమయంలో కోస్ట్‌ గార్డు అధికారులు, నౌకా సంస్థ తెలిపాయి. ఈ ప్రమాదానికి కార్గోలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల లిథియం-ఐయాన్ బ్యాటరీలు కారణమై ఉండొచ్చని నిపుణులు అనుమానిస్తున్నారు. ఇక నౌకలో ప్రధానంగా హ్యుందాయ్‌, కియా కంపెనీలకు చెందిన కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల పాటు మంటలతో పోరాడిన అనంతరం నౌక నీటిలో మునిగిపోవటం గమనార్హం. అలస్కాలోని అలూటియన్‌ దీవుల వద్ద తాజాగా ఈ నౌక మునిగిపోయిందని లండన్‌కు చెందిన ఓడ నిర్వహణ సంస్థ జోడియాక్‌ మారిటైమ్‌ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఘటన తర్వాత అంత పెద్దగా కాలుష్యం వెలువడలేదని యూఎస్ కోస్ట్‌గార్డ్‌ ప్రతినిధి తెలిపారు. కాలుష్య నియంత్రణ పరికరాలు కలిగిన రెండు సాల్వేజ్‌ టగ్‌లను అక్కడ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Next Story