వ్యక్తిగతంగా పరువు తీసుకునేలా టీఎంసీ ఎంపీల మధ్య మాటల యుద్ధం

by Shamantha N |

పశ్చిమ బెంగాల్ లా కాలేజీ స్టూడెంట్ పై లైంగిక దాడి ఘటన టీఎంసీ ఎంపీల మధ్య చిచ్చు రాజేసింది. కల్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది.

వ్యక్తిగతంగా పరువు తీసుకునేలా టీఎంసీ ఎంపీల మధ్య మాటల యుద్ధం
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లా కాలేజీ స్టూడెంట్ పై లైంగిక దాడి ఘటన టీఎంసీ ఎంపీల మధ్య చిచ్చు రాజేసింది. కల్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది. ఈ సారి కల్యాణ్ బెనర్జీ మొయిత్రా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు గుప్పించారు. ఒడిషాకు చెందిన బీజేపీ మాజీ ఎంపీ పినకా మిశ్రాను మొయిత్రా వివాహం చేసుకుందన్నారు. 40 ఏళ్ల వివాహ బంధం తెంచి ఓ కుటుంబాన్ని నాశనం చేసి, 65 ఏళ్ల వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుందన్నారు. ఆమెకు కేవలం డబ్బే ప్రధానమని విమర్శించారు. హనీమూన్ నుంచి నేరుగా వచ్చి తనను విమర్శిస్తోందని ఇలాంటి వ్యక్తులు కూడా తనకు నీతులు చెబితే తీసుకోవాలా అని ప్రశ్నించారు. అసలు మహువా మొయిత్రాకు మహిళల గురించి మాట్లాడే హక్కు ఉందా అని ధ్వజమెత్తారు. ఆమె తనను స్త్రీ వ్యతిరేకి అని ద్వేషిస్తోంది. మరి ఓ కుటుంబానికి ఆమె చేసిందేంటని వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆమె ఉపదేశాలు చేస్తే తాను తీసుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు.

స్త్రీ వ్యతిరేకి కల్యాణ్ బెనర్జీ : మొయిత్రా

లా కాలేజీ ఘటనలో కల్యాణ్ బెనర్జీ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ పై లైంగిక దాడి చేస్తే మనం ఏం చేస్తామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల్ని బీజేపీతో సహా మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. టీఎంసీ కల్యాణ్ బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని వాటితో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. కాగా మహుమా మొయిత్రా మాత్రం ఆయన స్త్రీ వ్యతిరేకి అని విమర్శించారు. బాధితురాలిని అవమానించే ముందు అన్ని తెలుసుకుని మాట్లాడాలని కల్యాణ్ బెనర్జీకి సూచించింది. మొయిత్రా తన ‘ఎక్స్’ పోస్టులో దేశంలో, పార్టీలో స్త్రీ ద్వేషం పెరిగిపోతుందని అన్నారు.

గతంలోనూ ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు

ఏప్రిల్ 4, 2025న ఈ ఇద్దరు టీఎంసీ ఎంపీలు న్యూఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ కార్యాలయంలో తీవ్ర వాగ్వాదానికి దిగారు. టీఎంసీ పార్టీ పోల్స్ కమిషన్ కు పంపిన మొమోరాండంలో మొయిత్రా పేరు తొలగించారు. దీంతో విబేధాలు తలెత్తాయి. కల్యాణ్ బెనర్జీ మరో టీఎంసీ ఎంపీ కీర్తి ఆజాద్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ పబ్లిక్ డొమైన్‌లో లీక్ కావడంతో ఈ సంఘటన చివరకు వెలుగులోకి వచ్చింది. చాట్‌లో బెనర్జీ మొయిత్రాను ‘వర్సటైల్ ఇంటర్నేషన్ లేడీ ’ అని రాయడం అది బయటకు రావడంతో వివాదం ముదిరింది.

Next Story