- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tianlong-3: చైనా భారీ రాకెట్ ప్రయోగం విఫలం.. స్పేస్‌ఎక్స్ ‘ఫాల్కన్-9’కు దీటుగా తయారీ
అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు పోటీగా, చైనా ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన భారీ రాకెట్ ‘తియాన్‌లాంగ్-3’ ప్రయోగం శుక్రవారం విఫలమైందని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: చైనా అంతరిక్ష ప్రయోగాల్లో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ (SpaceX) ఫాల్కన్-9 రాకెట్‌కు పోటీగా, చైనా ప్రైవేట్ రంగంలో అభివృద్ధి చేసిన భారీ రాకెట్ ‘తియాన్‌లాంగ్-3’ (Tianlong-3) ప్రయోగం శుక్రవారం విఫలమైందని అంతర్జాతీయ మీడియా స్పష్టం చేసింది. వాయవ్య చైనాలోని గోబీ ఎడారిలో ఉన్న జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12:17 గంటలకు (బీజింగ్ కాలమానం) ఈ రాకెట్‌ను ప్రయోగించారు. గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగం విఫలమైనట్లు రాకెట్ రూపకర్త, బీజింగ్‌కు చెందిన వాణిజ్య స్టార్టప్ సంస్థ ‘స్పేస్ పయనీర్’ (Space Pioneer) వెల్లడించింది. వైఫల్యానికి గల కచ్చితమైన కారణాలపై దర్యాప్తు జరుగుతోందని తెలిపిన సంస్థ.. ఈ ఘటన పట్ల తమ భాగస్వాములకు, ప్రజలకు క్షమాపణలు తెలిపింది. భవిష్యత్ ప్రయోగాలు విజయవంతం అయ్యేలా నిపుణుల బృందంతో కలిసి లోపాలను సరిదిద్దుతున్నట్లు పేర్కొంది.
రాకెట్ ప్రత్యేకతలు, 2026లో చైనా ప్రయోగాలు..
72 మీటర్ల పొడవు, 3.8 మీటర్ల వ్యాసం ఉండే ఈ రాకెట్‌ను పాక్షిక పునర్వినియోగ (Reusable) సామర్థ్యంతో తీర్చిదిద్దారు. కిరోసిన్-లిక్విడ్ ఆక్సిజన్ ఇంధనంతో పనిచేసే ఈ రాకెట్.. 17,000 నుంచి 22,000 కిలోల బరువును భూ దిగువ కక్ష్యలోకి తీసుకెళ్లగలదు. 2024 జూన్‌లో జరిపిన ఇంజిన్ గ్రౌండ్ టెస్ట్ (స్టాటిక్ ఫైర్) సమయంలోనూ రాకెట్ అనుకోకుండా క్లాంప్‌ల నుంచి విడిపోయి గాల్లోకి ఎగిరింది. కొద్ది దూరం ప్రయాణించి పేలిపోయింది. అప్పట్లో డిజైన్ మార్పులు చేసి, 350 మిలియన్ డాలర్ల నిధులు సమీకరించి తాజా ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఈ ఏడాది (2026) చైనా ఏకంగా 140కి పైగా అంతరిక్ష ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు చైనా చేపట్టిన 19 ప్రయోగాల్లో ఇది మూడో వైఫల్యం కావడం గమనార్హం.






