కార్గో షిప్ పై రష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి

by Naga Rani Yarlagadda |

ఉక్రెయిన్‌లోని కీలక రేవు పట్టణం ఒడెస్సా తీరంలో రష్యా జరిపిన భీకర క్షిపణి దాడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

కార్గో షిప్ పై రష్యా దాడి.. నలుగురు భారతీయులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్రెయిన్‌లోని కీలక రేవు పట్టణం ఒడెస్సా తీరంలో రష్యా జరిపిన భీకర క్షిపణి దాడిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గినియా-బిస్సావ్ పతాకం (ఫ్లాగ్)తో ప్రయాణిస్తున్న ‘గోల్డెన్ లియో’ (Golden Leo) అనే వాణిజ్య కార్గో నౌకపై రష్యా క్రూయిజ్ క్షిపణులతో విరుచుకుపడటంతో మరణించిన వారి సంఖ్య 10కి చేరింది. ఈ దాడి కారణంగా నౌకలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.

ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే ఉక్రెయిన్ నౌకాదళం, రెస్క్యూ టీమ్‌లు రాత్రంతా విస్తృతంగా గాలింపు మరియు సహాయక చర్యలు చేపట్టాయి. సోమవారం ఉదయానికి అందిన వివరాల ప్రకారం.. నౌకలో ఉన్న ఉక్రెయిన్‌కు చెందిన ఒక నౌకా పైలట్‌తో పాటు తొమ్మిది మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఉక్రెయిన్ సీపోర్ట్స్ అథారిటీ ధృవీకరించింది. మృతుల్లో నలుగురు భారతీయ పౌరులు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలుస్తోంది.

ఉక్రెయిన్ ఆర్థిక మూలాలపై రష్యా దెబ్బ

ఇటీవలి వారాల్లో రష్యా ఉక్రెయిన్‌కు చెందిన ఒడెస్సా రీజియన్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులను ముమ్మరం చేసింది. ఈ జూలై నెలలోనే రష్యా జరిపిన వివిధ దాడుల్లో 28 మంది పౌరులు మరణించారని ఒడెస్సా ప్రాంతీయ అధిపతి ఒలేహ్ కిపర్ వెల్లడించారు. నల్లసముద్రం (Black Sea) గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలను భయభ్రాంతులకు గురిచేయడం ద్వారా ఉక్రెయిన్ ఎగుమతులను దెబ్బతీయడమే రష్యా ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది.

Next Story