తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన రష్యా

by Shamantha N |

అధికారంలోకి వచ్చిన దాదాపు నాలుగేళ్ల తర్వాత అఫ్గాన్ లోని తాలిబన్ ప్రభుత్వానికి గొప్ప విజయం దక్కింది.

తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన రష్యా
X

దిశ, నేషనల్ బ్యూరో: అధికారంలోకి వచ్చిన దాదాపు నాలుగేళ్ల తర్వాత అఫ్గాన్ లోని తాలిబన్ ప్రభుత్వానికి గొప్ప విజయం దక్కింది. రష్యా ఒక చారిత్రాత్మక అడుగు వేసి తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించింది. ఇప్పటివరకు ఏ దేశం కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించకపోవడంతో ఈ చర్య ప్రపంచ రాజకీయాల్లో సంచలనంగా మారింది. తాలిబన్లు నియమించిన కొత్త అఫ్గాన్ రాయబారి గుల్ హసన్ హసన్‌ను అంగీకరిస్తూ రష్యా ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది. “ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గానిస్థాన్ ప్రభుత్వానికి అధికారిక గుర్తింపు లభించడం వల్ల ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో నిర్మాణాత్మక ద్వైపాక్షిక సహకారం పెరుగుతుందని మేం విశ్వసిస్తున్నాము” అని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు, రష్యా మంత్రి ఆండ్రీ రుడెంకో మాస్కోలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గుల్ హసన్ తో భేటీ అయ్యారు. ఆయన నుంచి ఆధారాలు స్వీకరించారు. దీంతో, తాలిబన్ పాలనను అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది.

అఫ్గాన్ లోని రాయబార కార్యాలయంలో..

అప్గాన్ లోని రష్యా రాయబార కార్యాలయంలో గత ప్రభుత్వం జెండా స్థానంలో తాలిబన్ జెండాను ఎగురవేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను రష్యా వార్తా సంస్థ సోటీఏఎస్ఎస్(TASS) విడుదల చేసింది. కాబూల్‌లోని తాలిబన్ అధికారులు రష్యా చర్యను స్వాగతించారు. ఇది రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు. తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి మాట్లాడుతూ.. ఇది ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల చరిత్రలో ఒక పెద్ద విజయం అని తెలిపారు. ఇకపోతే, 2021 ఆగస్టులో తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, రష్యా కాబూల్‌లోని తన రాయబార కార్యాలయాన్ని తెరిచి ఉంచి తాలిబన్ నాయకత్వంతో సంబంధాలు కొనసాగించడం గమనార్హం. వాణిజ్యం, ఆర్థిక రంగాలలో సహకారానికి ‘గణనీయమైన సామర్థ్యాన్ని’ చూస్తున్నామని, ఇంధనం, రవాణా, వ్యవసాయం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పనిచేయాలని యోచిస్తోందని రష్యా ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే, ఇప్పటివరకు ఏ దేశం కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. చాలా దేశాలు తాలిబన్లు అంతర్జాతీయ నిబంధనలు, ముఖ్యంగా మానవ హక్కులను తుంగలో తొక్కుతున్నాయని విమర్శించాయి. రష్యా తాలిబన్లను గుర్తించినప్పటికీ, అక్కడి మానవ హక్కుల విషయంలో నిబద్ధత పాటించాలని ప్రపంచ దేశాలు తాలిబన్లకు సూచిస్తున్నాయి.

Next Story