కర్ణాటకలో మైనార్టీలకు ఇండ్ల నిర్మాణాల్లో రిజర్వేషన్లు 15 శాతం పెంపు

by Shamantha N |

కర్ణాటకలో మైనారిటీలు ఇళ్లను నిర్మించుకునేందుకు ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ పథకంలో వారి రిజర్వేషన్‌ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది.

కర్ణాటకలో మైనార్టీలకు ఇండ్ల నిర్మాణాల్లో రిజర్వేషన్లు 15 శాతం పెంపు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో మైనారిటీలు ఇళ్లను నిర్మించుకునేందుకు ప్రవేశపెట్టిన గృహ నిర్మాణ పథకంలో వారి రిజర్వేషన్‌ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచుతూ కర్ణాటక సర్కార్ నిర్ణయం తీసుకుంది. గురువారం సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలోని కేబినెట్ ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర మంత్రి హెచ్‌కె. పటేల్ ధ్రువీకరించారు. ఇండ్లు లేని వారు మైనార్టీల్లో ఎక్కువగా ఉన్నారని అందుకే ‘హౌసింగ్ ఫర్ ఆల్’ అనే లక్ష్యంతో గృహ నిర్మాణ పథకంలో రిజర్వేషన్లను పెంచినట్లు ప్రకటించారు. జైనులు, బౌద్ధులు, మైనారిటీ సముదాయాలకు ఈ పెంపు వర్తిస్తుందని మంత్రి స్పష్టం చేశారు.

మైనార్టీల ఓటు బ్యాంకు కోసమే..

బీజేపీ నాయకుడు అమిత్ మాలవీయ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్నొన్నారు. మతం ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వలేమని రాజ్యాంగం స్పష్టంగా చెబుతోంది. అయినప్పటికీ, ఓటు బ్యాంకును ఆకర్షించేందుకు కాంగ్రెస్ మత రిజర్వేషన్లను ప్రోత్సహిస్తోందని, ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు. కర్ణాటకలో సామాజిక ఐక్యతను చెరిపేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ ఏడాది ప్రారంభంలో కర్ణాటక ప్రభుత్వం ‘ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ సవరణ బిల్’ ద్వారా ముస్లింలకు ప్రభుత్వం ఇచ్చే కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించింది. ఆ సమయంలో కూడా వివాదం చెలరేగింది. ఈ సవరణను బీజేపీ, జేడీఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌లో గవర్నర్ థావర్ చంద్ గెహ్లోట్, మత ఆధారిత రిజర్వేషన్ రాజ్యాంగానికి విరుద్ధమని పేర్కొంటూ, ఆ బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు పంపించారు.


Next Story