ఫిఫా వరల్డ్ కప్‌లో ‘రేసిజం’ కలకలం.. లైవ్ టీవీలో వివాదాస్పదమైన గుర్తు

by Ramesh Naini |

2026 ఫిఫా వరల్డ్ కప్‌లో జాత్యహంకార (రేసిజం) వివాదం చెలరేగింది. లైవ్ టీవీలో ఒక మ్యాచ్ అధికారి వివాదాస్పద చేతి గుర్తును ప్రదర్శించడం తీవ్ర దుమారానికి దారితీసింది.

ఫిఫా వరల్డ్ కప్‌లో ‘రేసిజం’ కలకలం.. లైవ్ టీవీలో వివాదాస్పదమైన గుర్తు
X

దిశ, డైనమిక్ బ్యూరో: 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో జాత్యహంకార (రేసిజం) వివాదం చెలరేగింది. లైవ్ టీవీలో ఒక మ్యాచ్ అధికారి వివాదాస్పద చేతి గుర్తును ప్రదర్శించడం తీవ్ర దుమారానికి దారితీసింది. ఆ అధికారిని తక్షణమే వరల్డ్ కప్ విధుల నుంచి తొలగించాలని ఫిఫా వివక్ష నిరోధక పర్యవేక్షక సంస్థ డిమాండ్ చేసింది. అంతర్జాతీయ మీడియా ప్రకారం.. ఆదివారం హ్యూస్టన్‌లో జర్మనీ, కురాకో జట్ల మధ్య మ్యాచ్‌కు ముందు బ్రాడ్‌కాస్టర్లు వీడియో రివ్యూ అనలిస్టుల బృందాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాకు చెందిన వీడియో అధికారి షాన్ ఎవాన్స్ తన కుడి చేతితో ‘ఓకే’ (OK) గుర్తును తలకిందులుగా చూపిస్తూ కెమెరాకు చిక్కాడు. డల్లాస్‌లోని వరల్డ్ కప్ బ్రాడ్‌కాస్ట్ సెంటర్ నుంచి ఆయన ఈ మ్యాచ్‌కు పనిచేశారు.

వివాదం ఎందుకు?

ఈ తలకిందుల ‘ఓకే’ గుర్తును శ్వేత జాతీయ అహంకారానికి (White supremacy), ఫార్-రైట్ భావజాలానికి ప్రతీకగా పరిగణిస్తారు. 2019లో న్యూయార్క్‌కు చెందిన యాంటీ-డిఫమేషన్ లీగ్ (ADL) కూడా దీనిని ద్వేషపూరిత చిహ్నంగా (Hate symbol) ప్రకటించింది. ఈ ఘటనపై ఫిఫా భాగస్వామ్య సంస్థ అయిన ‘ఫేర్ (Fare) నెట్‌వర్క్’ తీవ్రంగా స్పందించింది. ఇదొక ‘నియో-నాజీ’ సంకేతమని, ప్రపంచం మొత్తం చూస్తున్న సమయంలో కెమెరా ముందు ఉద్దేశపూర్వకంగా ఇలాంటి గుర్తును ప్రదర్శించిన సదరు అధికారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేసింది.

సరదా పనా? ఉద్దేశపూర్వకమా?

ఎవాన్స్ ఉద్దేశపూర్వకంగానే ఈ ద్వేషపూరిత గుర్తును ప్రదర్శించాడా..? లేదా సరదాగా చేశారా..? అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఫిఫా, ఆస్ట్రేలియా ఫుట్‌బాల్ సంఘాలను కోరారు. అయితే, ఈ వివాదం నేపథ్యంలో తదుపరి మ్యాచ్‌లలో టీవీ నిర్వాహకులు VAR (వీడియో రివ్యూ) ప్యానెల్‌ను ప్రేక్షకులకు చూపించడం నిలిపివేసినట్లు తెలుస్తోంది.

Next Story