Stock Market: యుద్ధానికి ఎండ్ కార్డ్.. స్టాక్ మార్కెట్లలో బుల్ రన్

by S Gopi |

ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు రవాణా జరిగే అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని తిరిగి తెరవడానికి ఇరుదేశాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం ట్రేడింగ్‌లోనే రాకెట్‌లా దూసుకెళ్లింది.

Stock Market: యుద్ధానికి ఎండ్ కార్డ్.. స్టాక్ మార్కెట్లలో బుల్ రన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య గత 107 రోజులుగా సాగుతున్న యుద్ధానికి ఎండ్ కార్డ్ పడటంతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా కుదుటపడ్డాయి. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో అధికారికంగా శాంతి ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా (ట్రూత్ సోషల్) వేదికగా ప్రకటించడంతో గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ కనిపించింది. ముఖ్యంగా, ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతు రవాణా జరిగే అత్యంత కీలకమైన 'హోర్ముజ్ జలసంధి'ని తిరిగి తెరవడానికి ఇరుదేశాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారత స్టాక్ మార్కెట్ సోమవారం ఉదయం ట్రేడింగ్‌లోనే రాకెట్‌లా దూసుకెళ్లింది. సెన్సెక్స్ ఏకంగా 736.38 పాయింట్లు పెరిగి 76,264 మార్కును తాకగా.. నిఫ్టీ కూడా 231 పాయింట్లు లాభపడి 23,853 వద్ద ట్రేడ్ అయింది. పశ్చిమ ఆసియాలో శాంతి వాతావరణం ఏర్పడటం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (బ్రెంట్ క్రూడ్) ధరలు ఒక్కసారిగా 4.55 శాతం తగ్గి, బ్యారెల్‌కు 83.36 డాలర్లకు పడిపోయాయి. భారత్ తన అవసరాల కోసం ఎక్కువగా చమురును దిగుమతి చేసుకుంటుంది కాబట్టి, ఆయిల్ ధరలు తగ్గడం మన దేశ ఆర్థికవ్యవస్థకు, రూపాయి స్థిరత్వానికి ఒక పెద్ద బూస్టర్ డోస్‌లా పనిచేస్తుందని విశ్లేషకులు వెల్లడించారు. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి టాప్ బ్లూ-చిప్ కంపెనీల షేర్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. మన మార్కెట్లతో పాటు, దక్షిణ కొరియాకు చెందిన కోస్పి ఏకంగా 6 శాతం, జపాన్ నిక్కీ 5 శాతానికి పైగా లాభపడటంతో ఆసియా మార్కెట్లన్నీ సానుకూల ర్యాలీ చూశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 94.49 వద్ద ఉంది.

Next Story