భారత్‌లో ఎల్ నినో ఎఫెక్ట్.. వరి, మొక్కజొన్న దిగుబడులు భారీగా తగ్గే చాన్స్!

by Kema Shiva Kumar |

‘ఎల్ నినో' ప్రభావంతో దేశంలో వ్యవసాయ సంక్షోభం తలెత్తే ముప్పు పొంచి ఉందా అంటే ఔననే సమాధానాలే వినిపిస్తున్నాయి.

భారత్‌లో ఎల్ నినో ఎఫెక్ట్.. వరి, మొక్కజొన్న దిగుబడులు భారీగా తగ్గే చాన్స్!
X

దిశ, వెబ్‌‌డెస్క్: ‘ఎల్ నినో' (El Nino) వాతావరణ మార్పుల వల్ల భారత్‌లో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దేశంలో రాబోయే ఖరీఫ్ సాగు, పంట దిగుబడులపై తీవ్ర ప్రభావం పడవచ్చని తెలిపింది. ఎల్ నినో ఎఫెక్ట్ వల్ల సాధారణంగా భారత్‌లో వర్షపాతం తగ్గడం, రుతుపవనాలు అస్తవ్యస్తం కావడం జరుగుతుంది. అది ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌ను దెబ్బతీసే ప్రమాదం ఉందని ఎఫ్‌వో పేర్కొంది. వర్షాధార పంటలపై ఈ మార్పుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ముఖ్యంగా వరి, మొక్కజొన్న పంటలు కీలకమైన ఎదుగుదల దశలో నీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉందని, దిగుబడులు కూడా భారీగా తగ్గుతాయని నివేదిక స్పష్టం చేసింది.

అదేవిధంగా పంటల నష్టంతో పాటు, వ్యవసాయంపైనే ఆధారపడి బతికే గ్రామీణ ప్రజల జీవనోపాధి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే వాతావరణ మార్పులతో ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో ఆహార భద్రత మరింత క్షీణించవచ్చని ఎఫ్‌ఏవో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంచనాలపై స్పందించిన భారత ప్రభుత్వం స్పందించి తాము ముందస్తు చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపింది. దేశంలో ఆహార భద్రతకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, నిత్యావసర ధాన్యాల కొరత రాకుండా చూసేందుకు తగినంత బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచినట్లు కేంద్ర వర్గాలు తెలిపాయి.

Next Story