- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాలకులకు పట్టదు... అధికారులకు గిట్టదు
గిరిజనాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని ప్రగల్బాలు పలికే ప్రజా ప్రతినిధులకు గిరిజన సమస్యల పై చర్చించే తీరికే లేదనుకుంటా.. ఐటీడీఏ పాలకమండలి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం అయి గిరిజన సంక్షేమం, అభివృద్ధి గురించి చర్చించాల్సి ఉంటుంది.

దిశ, భద్రాచలం : గిరిజనాభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని ప్రగల్బాలు పలికే ప్రజా ప్రతినిధులకు గిరిజన సమస్యల పై చర్చించే తీరికే లేదనుకుంటా.. ఐటీడీఏ పాలకమండలి ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం అయి గిరిజన సంక్షేమం, అభివృద్ధి గురించి చర్చించాల్సి ఉంటుంది. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సమావేశంలో చర్చించి, తీర్మానం చేసిన అంశాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపుతారు. సమస్యలకు అనుగుణంగా ఆయా ప్రభుత్వాలు ఐటీడీఏకు నిధులు మంజూరు చేస్తాయి. అయితే 27 నెలలు గడుస్తున్నా భద్రాచలం ఐటిడిఏ పాలకమండలి సమావేశం నిర్వహించకపోవడం చూస్తుంటే... పాలకులకు గిరిజన సంక్షేమం పై ఉన్న శ్రద్ద అర్ధం అవుతుంది. భద్రాచలం ఐటిడిఏ పాలకమండలి సమావేశం చివరిసారిగా 2024 ఫిబ్రవరి 18 న జరిగింది. 27 నెలలు గడుస్తున్నా, పాలకమండలి సమావేశం ఊసు లేదు. అధికారులు సైతం తమకెందుకులే అనుకుంటున్నారో ఏమో.. పాలక మండలి సమావేశం గురించి మాట్లాడటం లేదు. ఐటీడీఏ పరిధిలోని గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యం, సాగు నీరు, త్రాగు నీరు, రహదారులు, విద్యుత్ సౌకర్యం తదితర అంశాల గురించి పాలకమండలి సమావేశంలో చర్చించి తగు నిర్ణయం తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుంది. అయితే రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు పాలకమండలి సమావేశం నిర్వహించకపోవడంతో గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పొంచి ఉన్న వరద ముంపు..
ప్రతి సంవత్సరం వర్షాకాలంలో భద్రాచలం ఏజెన్సీని గోదావరి వరద ముంచెత్తుతుంది. వరదలు సంభవించినప్పుడు అనేక గిరిజన గ్రామాలు ముంపునకు గురికావడమే కాకుండా, అనేక గ్రామాలకు రవాణా వ్యవస్థ స్థంభిస్తుంది. ముంపు గ్రామాలలో నివసిస్తున్న గిరిజనులను రక్షించడానికి ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. పైగా పోలవరం ఎఫెక్ట్ తో ఈసారి వరద ముంపు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి ముఖ్య సమస్యలు పాలకమండలిలో చర్చించి అధికారులను సమాయత్తం చేయాల్సి ఉంటుంది.
ప్రారంభం అవుతున్న విద్యా సంవత్సరం..
నూతన విద్యా సంవత్సరం ప్రారంభం అయింది. గిరిజన గ్రామాల్లో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి..? ఆయా పాఠశాలల్లో, వసతి గృహాల్లో వసతులు ఎలా ఉన్నాయి..? తక్షణ చర్యలు ఏమన్నా తీసుకోవాలా.. అనే అంశాలను పాలకమండలిలో చర్చించాల్సి ఉంది. కాని పాలకులు, అధికారులు మాత్రం మూడు నెలలకు ఒకసారి కాదు, ముప్పై నెలలకు ఒకసారి అయినా సమావేశం నిర్వహించేలా లేరు.






