కుండల అమ్మకంలో తలెత్తిన వివాదం... ఇద్దరు మహిళలకు గాయాలు

by Batti.Sumithra |

చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయ గట్టు పై ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద కుండల అమ్మకం, బోనం సమర్పణ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది.

కుండల అమ్మకంలో తలెత్తిన వివాదం... ఇద్దరు మహిళలకు గాయాలు
X

దిశ, నార్కట్‌పల్లి : చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయ గట్టు పై ఉన్న ఎల్లమ్మ గుడి వద్ద కుండల అమ్మకం, బోనం సమర్పణ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఎల్లమ్మ గుడి వద్ద గత కొన్నేళ్లుగా ఎల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన శాలివాహన కులస్తులు కుండలను అమ్ముకోవడంతో పాటు అమ్మవారికి బోనం సమర్పిస్తూ వస్తున్నారు. ఈ కుండల అమ్మకం, బోనం సమర్పణను వంతుల వారీగా నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో, అదే గ్రామానికి చెందిన ఓ మహిళ వివాహం జరిగినప్పటికీ తిరిగి గ్రామానికే వచ్చి నివాసం ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు తోబుట్టువులు లేకపోవడంతో తనకూ వాటా ఇవ్వాలని గత కొంతకాలంగా కోరుతూ వస్తోంది. ఈ వివాదం క్రమంగా తీవ్రరూపం దాల్చి సోమవారం భారీ ఘర్షణకు దారితీసింది. అమావాస్య సందర్భంగా గట్టు పై కుండల అమ్మకం, బోనం సమర్పణలో నిమగ్నమైన బొడ్డుపల్లి జ్యోతి, బొడ్డుపల్లి భవానీల పై ఆమె కత్తితో దాడి చేసినట్లు సమాచారం.

దీంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. తొలుత గాయాలను సాధారణ గీతలుగా భావించినప్పటికీ, ఒకరికి చేతి పై కత్తి లోతుగా తగలగా, మరొకరికి వేలు ఊడిపోయేంత తీవ్ర గాయం అయినట్లు తెలుస్తోంది. ఘటనను గమనించిన భక్తులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని గొడవను అదుపులోకి తీసుకొచ్చారు. కుండల అమ్మకం, బోనం సమర్పణకు ఎటువంటి టెండర్ విధానం లేకపోయినా, కొంతకాలంగా వీరు తమ వృత్తిగా అక్కడే కుండల విక్రయాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ కుండల అమ్మకం విషయంలో గతంలోనూ పరస్పరం ఫిర్యాదులు చేసుకుని ప్రజాప్రతినిధులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దేవదాయ శాఖ పరిధిలోని ఇతర దేవాలయాల్లో ఇటువంటి ఆచారాలు లేకపోయినా, చెరువుగట్టు దేవాలయంలో మాత్రం కుండల అమ్మకం అంశం రాజకీయ రంగు పులుముకుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన భక్తులు ఎల్లమ్మ ఆలయానికి రావడానికి భయాందోళనలకు గురవుతున్నట్లు సమాచారం. ఘటన పై పోలీసులు వివరాలు సేకరించి కేసులు నమోదు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Next Story