కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. ఆరుగురు మృతి

by Naga Rani Yarlagadda |

ఖతార్ కు చెందిన మిలిటరీ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు.

కుప్పకూలిన సైనిక హెలికాప్టర్.. ఆరుగురు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఖతార్ లో ఆదివారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఖతార్ సాయుధ దళాలకు చెందిన ఒక మిలిటరీ హెలికాప్టర్ సాధారణ గస్తీ నిర్వహిస్తుండగా సాంకేతిక లోపం తలెత్తి సముద్రంలో కుప్పకూలిందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.

హెలికాప్టర్ కూలిపోయిన వెంటనే రక్షణ మంత్రిత్వ శాఖ సమాచారం మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. విమానంలో ఉన్న ఏడుగురిలో ఆరుగురి మృతదేహాలను వెలికితీశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదం పూర్తిగా సాంకేతిక లోపం వల్లే జరిగిందని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ దేశాల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభం కాగా, ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ఖతార్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, జోర్డాన్, సౌదీ అరేబియా వంటి దేశాలపై కూడా గత కొన్ని వారాలుగా దాడులు జరుగుతున్నప్పటికీ, తాజా హెలికాప్టర్ ప్రమాదానికి, యుద్ధానికి ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు.

Next Story