బంకూరా బీజేపీ కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసుల దాడి

by Shamantha N |

పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంకూరా బీజేపీ జిల్లా కార్యాలయంలో అర్థరాత్రి పోలీసులు చొరబడటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.

బంకూరా బీజేపీ కార్యాలయంలో అర్ధరాత్రి పోలీసుల దాడి
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బంకూరా బీజేపీ జిల్లా కార్యాలయంలో అర్థరాత్రి పోలీసులు చొరబడటం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భారీ పోలీసుల బృందం బీజేపీ కార్యాలయం గేటు ధ్వంసం చేసుకుని లోపలికి ప్రవేశించారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇదే విషయాన్ని బీజేపీ నేత సువేందు అధికారి ‘ఎక్స్’ లో పోస్టు చేశారు. పక్కన ఉండే నివాసాల్లోని ప్రజలు దీన్ని గమనించి బీజేపీ కార్యకర్తలకు సమాచారం ఇవ్వడంలో బీజేపీ కార్యకర్తలు ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులను నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.

ప్రతిపక్షాలపై దాడిని ఖండిస్తున్నాం: సువేందు అధికారి

ఈ దాడిని తీవ్రంగా ఖండించిన ప్రతిపక్ష నేత సువేందు అధికారి రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించారు. వెస్ట్ బెంగాల్ పోలీసులు మమతా బెనర్జీ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారని విమర్శించారు. పోలీసులు దొంగల్లా ప్రవర్తించారని విమర్శించారు. టీఎంసీ గుండాలపై చర్యలు తీసుకోకుండా ప్రతిపక్షాలపై మాత్రమే హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా రాష్ట్ర ఆహార సరఫరాల శాఖ మంత్రి జ్యోత్స్నా మండీ భర్త తుహిన్ మండీపై ఖత్రాలో జరిగిన దాడికి సంబంధించి బంకూరా బీజేపీ కార్యాలయంపై దాడి చేసినట్లు తెలుస్తోందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. రాజకీయ కక్షతో తమ పార్టీ కార్యాలయంపై అక్రమంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై నిరసనగా బీజేపీ ఆదివారం బంకూరాలో భారీ ప్రజా ఆందోళన నిర్వహిస్తోంది. అధికార పార్టీ పోలీసుశాఖను పూర్తిగా వాడుకుంటోందన్న ఆరోపణలతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది.

Next Story