రొట్టె, ఉప్పుతో ప్రధాని మోడీకి స్వాగతం.. స్లొవేకియా పర్యటనలో అరుదైన గౌరవం

by Ramesh Naini |

స్లొవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి సంప్రదాయం ప్రకారం ‘రొట్టె, ఉప్పు’ (బ్రెడ్ అండ్ సాల్ట్)తో అరుదైన, ఘన స్వాగతం లభించింది.

రొట్టె, ఉప్పుతో ప్రధాని మోడీకి స్వాగతం.. స్లొవేకియా పర్యటనలో అరుదైన గౌరవం
X

దిశ, డైనమిక్ బ్యూరో: స్లొవేకియా రాజధాని బ్రాటిస్లావా చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి సంప్రదాయం ప్రకారం ‘రొట్టె, ఉప్పు’ (బ్రెడ్ అండ్ సాల్ట్)తో అరుదైన, ఘన స్వాగతం లభించింది. 1993లో స్లొవేకియా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన తర్వాత, ఒక భారత ప్రధాని ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

రొట్టె, ఉప్పు ఎందుకంటే?

స్లొవేకియా సంస్కృతిలో (Bread) రొట్టె, (Salt) ఉప్పుతో స్వాగతం పలకడం అనేది అత్యంత పురాతనమైన ఆచారం. దేశాధినేతలు, అత్యంత గౌరవప్రదమైన అతిథులకు మాత్రమే ఈ మర్యాద దక్కుతుంది. ఈ సంప్రదాయంలో రొట్టె.. శ్రేయస్సు, సౌభాగ్యాలకు ప్రతీక, ఉప్పు.. విలువ, స్నేహం, రక్షణకు చిహ్నం.

ఆకట్టుకున్న ‘వందేమాతరం’

ఈ స్వాగత కార్యక్రమంలో సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్లొవేకియాలోని మిజావా (Myjava) ప్రాంతానికి చెందిన చిన్నారుల బృందం సంప్రదాయ జానపద నృత్యంతో ప్రధానిని అలరించింది. అలాగే, లుస్నికా ఎన్‌సెంబుల్ (Lucnica Ensemble) బృందం ఆలపించిన ‘వందేమాతరం’ గీతం ఆకట్టుకుంది. కాగా, తనకు లభించిన ఈ ఆత్మీయ స్వాగతంపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోను ‘ఎక్స్’ (X) లో పంచుకుంటూ.. ‘బ్రాటిస్లావాలో బ్రెడ్ అండ్ సాల్ట్‌తో పలికిన స్వాగతం స్లొవేకియా గొప్ప సాంస్కృతిక వారసత్వానికి, వారు ఎంతో విశ్వసించే స్నేహభావం, సద్భావనలకు అందమైన ప్రతిబింబం’ అని ఆయన పేర్కొన్నారు.

Next Story