Wholesale Inflation: 44 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం

by S Gopi |   (  Updated:2026-06-15 13:41:19  IST  )

మే నెలకొచ్చేసరికి వరుసగా ఎనిమిదో నెల పెరుగుదల మాత్రమే కాకుండా 2022, సెప్టెంబర్(44 నెలల గరిష్ఠం) తర్వాత అత్యధిక రికార్డును నమోదు చేసింది.

Wholesale Inflation: 44 నెలల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో కంపెనీల ఉత్పత్తి ఖర్చులు కొండెక్కి కూర్చుంటున్నాయి. దీనివల్ల తాజాగా విడుదలైన మే నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) గణాంకాలు ఏకంగా 9.68 శాతానికి చేరింది. అంతకుముందు ఏప్రిల్ నెలలో టోకు ద్రవ్యోల్బణం 8.3 శాతంగా నమోదైంది. మే నెలకొచ్చేసరికి వరుసగా ఎనిమిదో నెల పెరుగుదల మాత్రమే కాకుండా 2022, సెప్టెంబర్(44 నెలల గరిష్ఠం) తర్వాత అత్యధిక రికార్డును నమోదు చేసింది. దీనికి ప్రధానంగా పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ భయాలే. అక్కడ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. ఫలితంగా ఇంధనం, ఆహార పదార్థాలు, రసాయన ఉత్పత్తులు, లోహాల ధరలు పెరగడంతో తయారీ రంగంపై కూడా వ్యయ భారం పెరిగింది. ముఖ్యంగా ఇంధన రంగ ద్రవ్యోల్బణం 30.33 శాతానికి చేరగా, ముడి పెట్రోలియం, సహజ వాయువు ధరల పెరుగుదల 61.51 శాతానికి, మినరల్ ఆయిల్స్ ద్రవ్యోల్బణం 49.82 శాతానికి చేరడం పరిస్థితి తీవ్రతను చూపుతోంది.

కిచెన్‌కూ పాకిన సెగ

ఈ టోకు ధరల సెగ కేవలం ఫ్యాక్టరీలకే కాదు, మన వంటగది బడ్జెట్‌కూ తగిలింది. ఏప్రిల్‌లో 3.11 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం మే నెలలో 4.49 శాతానికి ఎగబాకింది. వ్యవసాయ ఉత్పత్తుల రేట్లు పెరగడంతో తయారీ రంగంలో ధరల భారం 7.48 శాతానికి పెరిగింది. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణాన్ని మరింత ఖచ్చితంగా లెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత పద్ధతులకు స్వస్తి పలుకుతూ.. 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని కొత్త ఆధార సంవత్సరం(బేస్ ఇయర్)గా తీసుకుని సవరించిన డబ్ల్యూపీఐ సిరీస్‌ను తీసుకొచ్చింది. ఈ కొత్త బాస్కెట్‌లో మార్కెట్ ట్రెండ్‌కు తగ్గట్టుగా 957 వస్తువులను చేర్చడమే కాకుండా.. సోలార్, విండ్ (పవన), అణు విద్యుత్ లాంటి గ్రీన్ ఎనర్జీ వనరులకు కూడా చోటు కల్పించారు. అంతేకాదు, భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ‘ప్రొడ్యూసర్స్ ప్రైస్ ఇండెక్స్’ (పీపీఐ) అనే సరికొత్త రేటింగ్ విధానానికి మారేందుకు కూడా కేంద్రం గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తోంది.

Next Story