మేతకు వెళుతున్న గేదెలు మాయం..!

by Batti.Sumithra |

మేత కోసం వదిలిన గేదెలను గుర్తుతెలియని వ్యక్తులు ట్రాలీ ఆటోలలో ఎక్కించుకుని విక్రయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని మల్లవరం, అన్నారగూడెం గ్రామాలకు చెందిన పశువుల యజమానులు ఆరోపిస్తున్నారు.

మేతకు వెళుతున్న గేదెలు మాయం..!
X

దిశ, తల్లాడ : మేత కోసం వదిలిన గేదెలను గుర్తుతెలియని వ్యక్తులు ట్రాలీ ఆటోలలో ఎక్కించుకుని విక్రయిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారని మల్లవరం, అన్నారగూడెం గ్రామాలకు చెందిన పశువుల యజమానులు ఆరోపిస్తున్నారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితులు శనివారం తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం పంట కోతలు పూర్తయిన తర్వాత వేసవి కాలంలో ప్రతిరోజూ ఉదయం గేదెలను మేతకు వదిలిపెడతారు. సాధారణంగా సాయంత్రానికి అవి తిరిగి ఇంటికి చేరుకుంటాయి. అయితే ఇటీవల కొన్ని రోజులుగా గేదెలు కనిపించకుండా పోతుండటంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు. గేదెల కోసం వారాల తరబడి వెతుకుతూ రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పెట్రోల్ ఖర్చు చేసినా ఆచూకీ లభించలేదని వారు వాపోయారు.

ఇటీవల సోమలగడ్డ గ్రామం వద్ద దొంగిలించిన గేదెలను ట్రాలీ ఆటోలో తరలిస్తుండగా ఒక గేదె కిందపడిపోయి తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. అయినప్పటికీ దొంగలు ఆ గేదెను రోడ్డు పై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఘటనతో దొంగల ఆచూకీకి కీలక ఆధారాలు లభించాయని బాధితులు తెలిపారు. అన్నారగూడెం గ్రామానికి చెందిన గోపిశెట్టి నరసింహారావు ఈ విషయమై తల్లాడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అలాగే మల్లవరం గ్రామానికి చెందిన సుమారు పది మంది రైతులు తమ గేదెలు దొంగతనానికి గురయ్యాయని, బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు.

గేదెల దొంగతనాలు పాల్పడుతున్న వ్యక్తులు అక్రమంగా లక్షల రూపాయలు సంపాదించి భూములు కొనుగోలు చేయడం, ఇండ్లు నిర్మించుకోవడం జరుగుతోందని బాధితులు ఆరోపించారు. శనివారం మల్లవరం గ్రామంలో గేదెల దొంగతనాల పై బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సమయంలో కొందరు జోక్యం చేసుకొని సర్ది చెప్పేందుకు రాగా వాగ్వాదానికి దిగినట్లు తెలిపారు. ఈ విషయంపైనా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. గ్రామస్థులు మాట్లాడుతూ మల్లవరం గ్రామం విద్యా, ఉద్యోగ రంగాల్లో మంచి పేరు సంపాదించిందన్నారు. ఇటీవల పోలీస్ నియామకాల్లో ఒకేసారి 18 మంది కానిస్టేబుళ్లుగా ఎంపిక కావడం, విద్యార్థులు ఉన్నత చదువుల్లో రాణించడం గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చాయని.. కానీ అయితే కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాల దొంగతనాలు, రూపీ కార్డుల చోరీలు, మేకలు, గొర్రెలు, గేదెల దొంగతనాల వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ గ్రామం ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా కొనసాగుతున్న గేదెల దొంగతనాల పై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. అలాగే పశువులను కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరారు.

Next Story