మైసూరు పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-15 13:34:29  IST  )

మైసూరులోని ప్రముఖ రెస్టోపబ్‌లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదంలో ఇద్దరు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు.

మైసూరు పబ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: మైసూరు (Mysore)లోని ప్రముఖ రెస్టోపబ్ (Restopub)లో ఇవాళ సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పబ్ యజమాని సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. మైసూరు నగరంలోని ఓ కమర్షియల్ భవనంలో ఉన్న పబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు పబ్ అంతటా వ్యాపించడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. లోపల ఉన్నవారు బయటకు వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే మార్గాలన్నీ మంటలతో మూసుకుపోయాయి. ఈ దుర్ఘటనలో ఊపిరాడక ఇద్దరు పబ్ సిబ్బంది డార్జిలింగ్ వాసి సాహిన్ (26), నేపాల్ వాసి ప్రకాష్ (24) ప్రాణాలు కోల్పోయారు.

ఐదుగురికి తీవ్ర గాయాలు..

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో పబ్‌లోనే చిక్కుకుపోయిన పబ్ యజమాని ప్రీతమ్ పుమీత్‌ (Preetham Pumith)తో పాటు మరో నలుగురు కస్టమర్లు సోనూ, రమేష్, మహాదేవ్ ప్రసాద్, ప్రజ్వల్, అవినాష్ తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ వారిని కాపాడి, చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story