భారత్-మలేషియా నవశకం.. కీలక అంశాలపై ప్రధానుల ఒప్పందాలు

by Naga Rani Yarlagadda |

మలేషియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై.. ఇరుదేశాల మధ్య వాణిజ్యంపై కీలక చర్చలు జరిపారు.

భారత్-మలేషియా నవశకం.. కీలక అంశాలపై ప్రధానుల ఒప్పందాలు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాతో భారత్ ఇటీవలే భారీ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మలేషియా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో సమావేశమై.. ఇరుదేశాల మధ్య వాణిజ్యంపై కీలక చర్చలు జరిపారు. ఈ క్రమంలో రెండు దేశాలు పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరుదేశాల ప్రధానులు కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో కీలక విషయాలను వెల్లడించారు. మలేషియా ప్రధాని అన్వర్ మాట్లాడుతూ.. భారత్, మలేషియా దేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ప్రస్తుత చర్చలు అత్యంత కీలమని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దశాబ్దాల నాటి అనుబంధాన్ని ఆయన కొనియాడారు.

వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు అడుగులు

"భారత్-మలేషియా మధ్య 1957 నుంచే సుదీర్ఘ సంబంధాలు ఉన్నాయి. అయితే.. 2024లో ఈ బంధాన్ని 'సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం' (Comprehensive Strategic Partnership) స్థాయికి పెంచుకున్నాం. లోతైన చారిత్రక సంబంధాలు, ప్రజల మధ్య ఉన్న పటిష్టమైన అనుబంధం, విస్తరిస్తున్న ఆర్థిక సహకారం మా బంధానికి మూలస్తంభాలు" అని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇరు దేశాలు అన్ని కీలక రంగాల్లో కలిసి పనిచేస్తాయని అన్వర్ ఇబ్రహీం స్పష్టం చేశారు. ఏఐ, డిజిటల్ టెక్నాలజీల్లో పరస్పర సహకారంపై ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

ఉగ్రవాద నిర్మూలనకు కలిసి పనిచేస్తాం

వాణిజ్యం, పెట్టుబడులు, సెమీకండక్టర్ రంగం, డిజిటల్ ఎకానమీ, స్థానిక కరెన్సీల్లో వాణిజ్య లావాదేవీల నిర్వహణ, కనెక్టివిటీ, ఇంధనం, రక్షణ రంగం, ఆరోగ్యం, విద్య, పర్యాటకం, ఆహార భద్రతలపై.. మొత్తం 11 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అలాగే ఉగ్రవాద నిర్మూలనకు రెండుదేశాలు కలిసి పనిచేస్తాయని, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధి, శాంతికి కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. ప్రపంచ వృద్ధి, వాణిజ్యానికి ఇండో-పసిఫిక్ ప్రాంతం కీలకమని తెలిపారు. భారత్ - మలేషియా మధ్య సంబంధాలు అత్యంత విశిష్టమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. భారత్-మలేషియా కేవలం మిత్రదేశాలే కాదు, సముద్ర తీర సరిహద్దులు పంచుకుంటున్న పొరుగుదేశాలు కూడా అని తెలిపారు. శతాబ్దాలుగా ఇరు దేశాల ప్రజల మధ్య విడదీయలేని లోతైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా భారత సంతతి ప్రజలు అత్యధికంగా నివసిస్తున్న దేశాలలో మలేషియా రెండో స్థానంలో ఉందని, ఇది మన మధ్య ఉన్న సామాజిక అనుబంధానికి నిదర్శనమని తెలిపారు.

ఒప్పందాల్లో హైలైట్స్

సెమీకండక్టర్ రంగం: అంతర్జాతీయ చిప్ సరఫరా వ్యవస్థలో మలేషియా కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, సెమీకండక్టర్ డిజైన్ మరియు తయారీలో పరస్పర సహకారం.

స్థానిక కరెన్సీలో వాణిజ్యం: డాలర్‌పై ఆధారపడకుండా రూపాయలు మరియు రింగిట్లలో నేరుగా వాణిజ్యం చేసేందుకు అంగీకారం.

డిజిటల్ ఎకానమీ: ఫిన్‌టెక్, యూపీఐ వంటి డిజిటల్ చెల్లింపుల వ్యవస్థల విస్తరణపై చర్చలు.

రక్షణ & భద్రత: శాంతి పరిరక్షణ కార్యకలాపాలు మరియు సైనిక శిక్షణలో సహకారం పెంపు.

కార్మికుల సంక్షేమం: మలేషియాలో పనిచేస్తున్న భారతీయ కార్మికుల భద్రత మరియు ఉపాధి అవకాశాల మెరుగుదల కోసం ఒప్పందం.

హెల్త్‌కేర్ & టూరిజం: ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్య విధానాలతో పాటు పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం.

Next Story