ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. సీసీఐపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

by Prasad Jukanti |

ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ రాశారు.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.. సీసీఐపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కర్మాగారం పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం తన అధికారిక వైఖరిని స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీసీఐ పునరుద్ధరణ అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం మాత్రమే కాదని ఇది వేలాది కుటుంబాల జీవనాధారం, ఆదిలాబాద్ జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన అత్యంత కీలకమైన అంశం అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి (Revanth Reddy) బహిరంగ లేఖ (KTR Letter) రాశారు.

కేంద్రం ఓకే.. రాష్ట్ర ప్రభుత్వం వల్లే జాప్యం:

ఇటీవలే ఢిల్లీ వెళ్లి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామిని కలిసిన విషయాన్ని కేటీఆర్ లేఖలో గుర్తుచేశారు. సీసీఐ ఆదిలాబాద్ ప్లాంట్ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం రూ.250 కోట్ల పెట్టుబడితో ముందుకు వస్తే ప్రక్రియ సాధ్యమవుతుందని కేంద్ర మంత్రి స్పష్టంగా వెల్లడించారని అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు కానీ, సహాయ సహకారాలపై అధికారిక ప్రతిపాదనలు అందకపోవడం వల్లే జాప్యం జరుగుతోందని మంత్రి చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర సర్కారు స్పందన కోసం ఎదురుచూస్తున్న ఈ పరిస్థితుల్లో ఇప్పటి వరకు మీ ప్రభుత్వ వైఖరిని ప్రకటించకపోవడం అత్యంత విచారకరం అని, గత రెండున్నరేళ్లుగా మీ కాంగ్రెస్ ప్రభుత్వంలో చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఈ విషయంలో జాప్యం జరుగుతోందనే విషయం తేటతెల్లమైందన్నారు. ఆదిలాబాద్ వంటి వెనుకబడిన జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ విషయంలో ప్రభుత్వం చూపుతున్న ఈ నిర్లక్ష్యం ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో ఈ అంశంపై పూర్తి చిత్తశుద్ధితో పనిచేసిందని పేర్కొన్నారు. మా ప్రభుత్వం నాడు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నప్పటికీ, నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే నెపంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్లాంట్‌ను పునరుద్ధరించలేదన్నారు.

ఈ ఆరు అంశాలపై స్పష్టత ఇవ్వండి:

ఆదిలాబాద్ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని, రాజకీయాలకు అతీతంగా ఈ అంశంపై వెంటనే సానుకూల నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని, సీసీఐ పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం తన పూర్తి సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రితో పాటు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు సమయం కేటాయిస్తే, సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో కలిసి వినతి పత్రం సమర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. తెలంగాణ ప్రజల తరఫున, ముఖ్యంగా ఆదిలాబాద్ వాసుల పక్షాన ముఖ్యమంత్రి ఈ ఆరు అంశాలపై స్పష్టత ఇవ్వాలని కేటీఆర్ కోరారు.

1.ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణపై తెలంగాణ ప్రభుత్వ అధికారిక వైఖరి ఏమిటి?

2.కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు పంపింది?

3.రూ.250 కోట్లను రాష్ట్ర వాటాగా పెట్టుబడి పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందా, లేదా?

4.సీసీఐ పునరుద్ధరణ కోసం టీఎస్-ఐపాస్ తరహా రాయితీలను వర్తింపజేయడానికి మీ ప్రభుత్వం సిద్ధమేనా?

5.అవసరమైతే కేంద్ర-రాష్ట్ర సంయుక్త భాగస్వామ్యంతో పరిశ్రమ నిర్వహించేందుకు రాష్ట్ర సర్కారు ముందుకు వస్తుందా?

6.ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే, తెలంగాణ ప్రభుత్వం స్వయంగా ఈ పరిశ్రమను పునరుద్ధరించే కార్యాచరణ ప్రణాళిక ఏమైనా ఉందా?

Next Story