- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు ‘ఎల్‌నినో’ పై కనీస అవగాహన లేదు
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు వ్యాఖ్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు.

దిశ, హనుమకొండ కలెక్టరేట్: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన కాలం తెచ్చిన కరువు కాదు… కాంగ్రెస్ తెచ్చిన కరువు వ్యాఖ్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. ప్రపంచ వాతావరణ మార్పులు, ఎల్‌నినో ప్రభావంపై కనీస అవగాహన లేకుండా కేటీఆర్ మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. అమెరికాలో చదువుకున్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యకరమని వ్యాఖ్యానించారు. హనుమకొండలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావం వల్లే ప్రపంచంలోని అనేక దేశాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టంగా చెబుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ప్రకృతి పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా బాధ్యులను చేస్తారు, ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లి ఏదైనా చేశారా, కనీస శాస్త్రీయ అవగాహన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం కేటీఆర్ స్థాయికి తగదు.
ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సూచనలు చేస్తే ప్రభుత్వం స్వాగతిస్తుంది. కానీ ప్రజలను తప్పుదారి పట్టించే విషప్రచారానికి పాల్పడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారు అని భట్టి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అక్రమంగా కూడబెట్టిన సొమ్ముతో ఏర్పాటు చేసుకున్న కొన్ని పత్రికలు, టెలివిజన్ ఛానళ్ల ద్వారా ప్రభుత్వం పై నిరాధార ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును ఉద్దేశించి భట్టి విక్రమార్క పలు ప్రశ్నలు సంధించారు. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించామని గొప్పలు చెప్పుకున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కేవలం మూడేళ్లకే ఎందుకు కుంగిపోయింది, దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకత్వంపై ఉంది అని నిలదీశారు.
కాళేశ్వరం కంటే ఎగువన కాంగ్రెస్ హయాంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 టీఎంసీల సామర్థ్యంతో నేటికీ సురక్షితంగా నిలిచి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తోందని చెప్పారు. అలాగే ఆరు దశాబ్దాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌ఎస్‌పీ) కూడా గోదావరి వరదలను సమర్థంగా తట్టుకుని ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందని గుర్తు చేశారు. అదే గోదావరి నది… అదే ఇసుక పునాది… కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తుంటే, బీఆర్ఎస్ నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ మాత్రం మూడేళ్లకే ఎందుకు కుంగిపోయిందో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి అని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






