వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటికుంటలను ఏర్పాటు చేయాలి : కలెక్టర్

by Taduka Kalyani |

వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటి కుంటల నిర్మాణం మహత్తరమైనదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.

వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటికుంటలను ఏర్పాటు చేయాలి : కలెక్టర్
X

దిశ, ఉట్నూర్: వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు నీటి కుంటల నిర్మాణం మహత్తరమైనదని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం ఉట్నూర్ మండలంలోని పెద్ద సుద్దగూడ, గంగాపూర్ గ్రామాలతో పాటు మండల కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. పెద్ద సుద్దగూడ గ్రామ పర్యటనలో భాగంగా నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిని, లబ్ధిదారులకు అందుతున్న మౌలిక సదుపాయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులకు ఆర్థిక, సాంకేతిక సహకారాన్ని సకాలంలో అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వంటి మౌలిక వసతులు వెంటనే కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గిరిజన సంక్షేమ బాలికల హాస్టల్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్‌లోని వంటగది, భోజన శాల (డైనింగ్ హాల్), సరుకుల నిల్వ గదులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. హాస్టల్ విద్యార్థినులతో ముఖాముఖిగా మాట్లాడి, వారికి అందుతున్న వసతులు, భోజన సదుపాయాలు విద్యాబోధన గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఐటీడీఏ కాంప్లెక్స్ నుంచి ఎవరెస్ట్ శిఖర అధిరోహణకు పయనమవుతున్న పర్వతారోహకులు మాడవి కన్నీబాయి, కాట్లే ఆనందరావుల ప్రయాణాన్ని కలెక్టర్ జెండా ఊపి ఘనంగా సాగనంపారు. అనంతరం తెలంగాణ జలసిరి కార్యక్రమం అమలులో భాగంగా ఉట్నూర్ మండలంలోని గంగాపూర్ గ్రామంలో నీటి కుంటల నిర్మాణాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ, పోషకాహార లోప నివారణే ధ్యేయంగా పోషకాహార తోటను ప్రారంభించి, మొక్కను నాటి నీరు పోశారు. ఉట్నూర్ శాంతినగర్‌లో వజ్రం ప్యూర్ ఫైర్ శుద్ధ జల కేంద్రంను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో కలిసి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం తో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏఎస్పీ ఋత్విక్ సాయి, ఎంపీడీఓ రాయిస్ఉద్దీన్, నంది ఫౌండేషన్ ప్రతినిధులు, స్థానిక సర్పంచ్ అనిత శ్రీనివాస్ జాదవ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్, ఆర్డీవో రాథోడ్ మోహన్ సింగ్, ఎమ్మార్వో రఘునాథ్, ఐటీడీఏ ఏపీఓ వసంతరావు, డిప్యూటీ డీఎంహెచ్ ఓ గడ్డం చంద్రశేఖర్, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, తదితరులు పాల్గొన్నారు.

Next Story