కాక్రోచ్ పార్టీ నిరసనల సెగ.. ఢిల్లీలో మూతపడ్డ 16 మెట్రో స్టేషన్లు!

by Ramesh Naini |

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు దేశ రాజధానిలో రవాణా వ్యవస్థను స్తంభింపజేశాయి.

కాక్రోచ్ పార్టీ నిరసనల సెగ.. ఢిల్లీలో మూతపడ్డ 16 మెట్రో స్టేషన్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), మరోవైపు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళనలు దేశ రాజధానిలో రవాణా వ్యవస్థను స్తంభింపజేశాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) బుధవారం ఉదయం ఏకంగా 16 కీలక మెట్రో స్టేషన్లను మూసివేసింది. దీంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్లూ లైన్, వయొలెట్ లైన్ మార్గాల్లోని పలు స్టేషన్లు మూతపడటంతో ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి మధ్యలోనే రూట్లు మార్చుకోవాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ రవాణా మార్గాల కోసం ఉదయం రద్దీ సమయంలో నానా అవస్థలు పడ్డారు. మెట్రో రైళ్లు నడుస్తున్నప్పటికీ, మూసివేసిన స్టేషన్లలో ఆగకుండా వెళ్లిపోవడంతో ప్రయాణికులు రోడ్డు మార్గం ద్వారా వెనక్కి ప్రయాణించాల్సి వచ్చింది. వారం వ్యవధిలో ఇలా మెట్రో సేవలకు అంతరాయం కలగడం ఇది రెండోసారి కావడం గమనార్హం (సోమవారం కూడా ఇదే తరహాలో మూసివేశారు).

మూసివేసిన మెట్రో స్టేషన్లు ఇవే..

రాజీవ్ చౌక్

పటేల్ చౌక్

♦ రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్

♦ బారాఖంబా రోడ్

♦ సుప్రీంకోర్టు

♦ సేవా తీర్థ్

♦ జన్ పథ్

♦ మండి హౌస్

♦ సెంట్రల్ సెక్రటేరియట్

♦ ఐటీఓ (ITO)

♦ ఢిల్లీ గేట్

♦ ఇంద్రప్రస్థ

♦ ఖాన్ మార్కెట్

♦ జోర్ బాగ్

♦ శివాజీ స్టేడియం

ప్రయాణికులకు ఊరటనిచ్చే తాజా అప్‌డేట్

ఉదయం ఆందోళనల కారణంగా ఝండేవలన్ (Jhandewalan) స్టేషన్‌ను కూడా అదనంగా మూసివేసినట్లు ప్రకటించిన డీఎంఆర్‌సీ, తర్వాత ప్రయాణికులకు కాస్త ఊరటనిచ్చింది. ఝండేవలన్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ప్రస్తుతం తెరిచారు. స్టేషన్లను మూసివేసినప్పటికీ, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ స్టేషన్లలో ‘ఇంటర్‌చేంజ్’ (లైన్లు మారే సదుపాయం) యథాతథంగా అందుబాటులో ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Next Story