భారతీయ వారసత్వ ఆభరణం.. మెట్ గాలాలో ప్రత్యక్షం

by Bhoopathi Nagaiah |   (  Updated:2025-06-18 15:06:17  IST  )

2022 సంవత్సరంలో మిరుమిట్లు గొలిపే ఈ ఉత్సవంలో వేదిక మీద ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది

భారతీయ వారసత్వ ఆభరణం.. మెట్ గాలాలో ప్రత్యక్షం
X

మెట్ గాలా అనేది న్యూయార్క్ మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ సంస్థ ఆధ్వర్యంలో నడిచే కాస్ట్యూమ్ ఇనిస్టిట్యూట్ కోసం నిధుల సేకరణ నిమిత్తం ఏటా నిర్వహించే గొప్ప ఫ్యాషన్ ఉత్సవం. 1948లో మొదలైన ఈ ఉత్సవం ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రత్యేకమైన కార్యక్రమాలలో ఒకటిగా మారి, ఎ-లిస్ట్ సెలబ్రిటీలను, ఫ్యాషన్ దిగ్గజాలను ఆకర్షిస్తోంది.

ఎమ్మా ఛాంబర్లేన్ మెడలో వజ్రపు చోకర్

2022 సంవత్సరంలో మిరుమిట్లు గొలిపే ఈ ఉత్సవంలో వేదిక మీద ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది - యూట్యూబర్, ఫ్యాషన్ దిగ్గజం ఎమ్మా ఛాంబర్లేన్ ఎప్పుడో గల్లంతైన అద్భుతమైన పాటియాలా నెక్లెస్‌లో భాగమైన వజ్రపు చోకర్ ధరించి కనిపించింది. 'పాటియాలా నెక్లెస్' మళ్లీ వెలుగులోకి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచింది.

వెలుగులోకి వచ్చిన 'పాటియాలా నెక్లెస్'

పాటియాలా నెక్లెస్ అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ వారసత్వ ఆభరణాలలో ఒకటి. 1928లో పాటియాలా మహారాజు భూపిందర్ సింగ్ ఈ అమూల్యమైన ఆభరణాన్ని కార్టియర్ కంపెనీ చేత పారిస్‌లో రూపొందింపజేశారు. ఇందులో 2,930 వజ్రాలు ఉన్నాయి, ముఖ్యంగా డి బీర్స్ కంపెనీకి చెందిన అరుదైన పసుపు రంగు వజ్రం ఈ నెక్లెస్‌లో కీలక భాగం. ఇది చరిత్రలోనే అత్యంత విలాసవంతమైన ఆభరణాల కల్పనగా పరిగణన పొందింది. దీని విలువ ప్రస్తుతం 30 మిలియన్ డాలర్ల పైగా ఉండవచ్చని అంచనా. భారత వారసత్వ ఆభరణాలు, సంపద అపహరణకు గురై పశ్చిమ దేశాలలో ప్రత్యక్షం కావటం గురించిన చర్చ మళ్ళీ ఒకసారి మొదలైంది.

1948లోనే అదృశ్యం..

మ్యాప్ అకాడమీ అనే చారిత్రక, సాంస్కృతిక పరిశోధన సంస్థ ప్రకారం, 1948లో ఈ నెక్లెస్ అదృశ్యమవడం, దాని భాగాలు మళ్లీ వెలుగులోకి రావడమనేది అనేక ఊహాగానాలకు దారి తీసింది. ప్రస్తుతం ఉన్న నెక్లెస్, కార్టియర్ సంస్థ భద్రపరిచిన రూపం, ఇందులో గల్లంతైన భాగాలను ఎంతో జాగ్రత్తతో ప్రతిరూపింపజేశారు.

ప్రపంచంలోనే ఏడో అతిపెద్ద వజ్రం

ఈ పసుపు వజ్రాన్ని 1888లో డి బీర్స్ దక్షిణాఫ్రికా గనిలో కనుగొన్నారు. మొదట దీని బరువు 400 క్యారెట్లు. దీన్ని కుషన్ కట్ విధానంలో 230 క్యారెట్లకు తగ్గించగా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా ఏడవ స్థానంలో నిలిచింది. 1889లో పాటియాలా మహారాజు భూపిందర్ సింగ్ పారిస్ ప్రదర్శనలో దీనిని ఖరీదు చేసినట్లు సమాచారం.

మెరిసే డి బీర్స్ వజ్రం

మ్యాప్ అకాడమీ ఇలా భావిస్తుంది: " మొట్టమొదటి పాటియాలా నెక్లెస్‌లో దక్షిణాసియా సంప్రదాయ ఆకృతులను యూరోపియన్ డిజైన్లతో కలిపి, ఐదు ప్లాటినం గొలుసులు, ఒక చోకర్ (మెడపట్టీ) అమర్చబడినాయి. ఈ గొలుసులన్నింటా చిన్న చిన్న వజ్రాలు అమరాయి. వాటితో పాటు 18 నుండి 73 క్యారెట్ల మధ్య ఉన్న ఏడు పెద్ద వజ్రాలు, కొన్ని పచ్చలు, బర్మీస్ కెంపులు ఉన్నాయి. ఇందులో ప్రముఖంగా అత్యంత విలువైన డి బీర్స్ వజ్రం అమర్చి ఉంది."

తయారీకి మూడేళ్లు పట్టిన సమయం

దాదాపు 1,000 క్యారెట్లు బరువు కలిగిన ఈ అమూల్య హారం రూపుదిద్దుకోవటానికి మూడు సంవత్సరాలు పట్టింది. 1948లో అదృశ్యమయ్యే వరకు ఇది పాటియాలా ఖజానాలో భాగంగా ఉండేది. ఈ నెక్లెస్‌ని ముక్కలుగా విడదీసి భారతదేశం నుండి అక్రమంగా తరలించారని విశ్వసనీయ సమాచారం. 1982లో సోథెబీస్ వేలంలో డి బీర్స్ వజ్రం ఒకసారి ప్రత్యక్షమైంది. కానీ అది ప్రస్తుతం ఎక్కడుందో తెలియదు.

1998లో, నెక్లెస్ నుండి విడగొట్టిన ప్లాటినం గొలుసులను ఒక ఆభరణాల నిపుణుడు లండన్ నగరంలోని తాకట్టు దుకాణంలో కనుగొన్నాడు. పెద్ద వజ్రాలేవీ అందులో లేవు. కార్టియర్ సంస్థ దానిని సంపాదించి పునరుద్ధరించింది. రత్నాల స్థానంలో సింథటిక్ వజ్రాలు, జిర్కోనియా అమర్చింది.

పాటియాలా ప్రభువు వేషంలో గాయకుడు దిల్జీత్ దోసాంజ్

2025 మెట్ గాలా ఉత్సవంలో భారతీయ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ పంజాబీ రాచరికపు వేషధారణతో ప్రవేశించాడు. ప్రపంచంలోని అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్ కోసం ఈ గాయకుడు అలనాటి పాటియాలా ప్రభువు ధరించినటువంటి దుస్తులు, ఆభరణాలు, కరవాలం ధరించి ప్రవేశించాడు. పాటియాలా ఖజానా నుండి అపహరణకు లోనైన హారం మళ్ళీ వార్తలలో కెక్కింది.

-శ్రీదేవి మురళీధర్

[email protected]

Next Story