- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యాన్ హోల్ మూతల చోరీపై సీఎం సీరియస్.. ఆర్థిక సంక్షోభమే కారణమా?
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం డ్రైనేజీ (మ్యాన్‌హోల్) మూతల దొంగతనాలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం డ్రైనేజీ (మ్యాన్‌హోల్) మూతల దొంగతనాలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చింది. ముఖ్యమంత్రి మరియం నవాజ్ ఈ కొత్త నిబంధనలను ప్రకటిస్తూ, నిందితులకు భారీ జరిమానాలతో పాటు సుదీర్ఘ కాలం జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.
ఇటీవల లాహోర్‌లోని భాటీ గేట్ సమీపంలో జరిగిన ఒక విషాద ఘటన ఈ చట్టానికి ప్రధాన కారణమైంది. దాతా దర్బార్ వద్ద బహిరంగ డ్రైనేజీలో పడి ఓ మహిళ, ఆమె 10 నెలల పసికందు మృతి చెందారు. సర్గోధాలో కూడా ఒక చిన్నారి మ్యాన్‌హోల్‌లో పడి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనలపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. గటర్ మూతలను దొంగిలించినా, కొనుగోలు చేసినా, విక్రయించినా కఠిన శిక్షలు తప్పవని సీఎం మరియం నవాజ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.
ముఖ్యమంత్రి మరియం నవాజ్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. మ్యాన్‌హోల్ మూతలను దొంగిలించినా, అమ్మినా లేదా కొనుగోలు చేసినా 1 సంవత్సరం నుండి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ వల్ల ఎవరైనా ప్రాణాలు కోల్పోతే, దానికి కారణమైన వారికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ. 50 లక్షల (పాకిస్థాన్ రూపాయలు) భారీ జరిమానా విధిస్తారు. కేవలం దొంగలపైనే కాకుండా, ఆ ఇనుమును కొనుగోలు చేసే స్క్రాప్ డీలర్లు, ఫ్యాక్టరీలపై కూడా నిఘా పెంచారు. కొన్ని సందర్భాల్లో సంస్థలకు రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
అసలు దొంగతనాలు ఎందుకు?
మ్యాన్ హోల్ మూతల దొంగతనాలకు అసలు కారణం అక్కడ నెలకొన్న ఆర్థిక సంక్షోభమని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ అది నిజం కాదని పాక్ మీడియా చెబుతోంది. పాకిస్థాన్ మార్కెట్‌లో ఒక కొత్త మ్యాన్‌హోల్ మూత ధర రూ. 8,000 నుండి రూ. 12,000 వరకు ఉంటుంది. దీనికి ఉండే సుమారు 30 కిలోల బరువైన ఇనుప రింగ్ కోసం దొంగలు వీటిని ఎత్తుకెళ్తున్నారు. పాత ఇనుము మార్కెట్‌లో ఇది తక్షణ నగదును ఇస్తుండటంతో, ఇది ఒక వ్యవస్థీకృత నేరంగా మారింది. "మేము ఉదయం మూతలు వేసి వెళ్తుంటే.. సాయంత్రానికల్లా అవి మాయమవుతున్నాయి" అని సీఎం మరియం నవాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని, ఇకపై ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని ఆమె స్పష్టం చేశారు. 2025 డిసెంబర్‌లో డాన్ న్యూస్ ప్రచురించిన నివేదిక ప్రకారం, అక్రమ వ్యాపారంలో పాల్గొన్న సంస్థలపై రూ.100 కోట్ల వరకు జరిమానా విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయనుంది. ప్రమాదకర ప్రాంతాల్లో నిఘా పెంచనున్నారు. నీటి సరఫరా, మురుగునీటి శాఖలకు గటర్ మూతలు మాయమైతే వెంటనే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.






