- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
terrorist camps: ఉగ్రవాద శిబిరాలను పునర్ నిర్మిస్తున్న పాకిస్థాన్
ఆపరేషన్ సిందూర్ లో ధ్వంసం అయిన పాక్ ఉగ్రవాద శిక్షణ శిబిరాలను, లాంచ్ ప్యాడ్లను తిరిగి నిర్మించడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ లో ధ్వంసం అయిన ఉగ్రవాద శిక్షణ శిబిరాలను, లాంచ్ ప్యాడ్లను తిరిగి నిర్మించడానికి పాకిస్థాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. భారత ఇంటిలిజెన్స్ సంస్థల సమాచారం ప్రకారం.. పాకిస్థాన్ సైన్యం, ఐఎస్‌ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్), ప్రభుత్వ సహకారంతో కలసి ఈ ఉగ్రవాద మౌలిక సదుపాయాలను పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK)పరిసర ప్రాంతాల్లో తిరిగి నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. భారీ దాడులు, గగనతల నిఘా నుంచి తప్పించుకునేలా నియంత్రణ రేఖ (LoC)కు ఆనుకుని అడవులు, గుట్టలు ఉన్న ప్రాంతాల్లో చిన్నచిన్న హైటెక్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. లష్కరే తోయిబా (LeT), జైషే మహమ్మద్ (JeM), హిజ్బుల్ ముజాహిదీన్, ద రిజిస్టెన్స్ ఫ్రంట్ (TRF) వంటి తీవ్రవాద సంస్థలకు చెందిన స్థావరాలను భారత వాయుసేన ‘ ఆపరేషన్ సిందూర్’ లో ధ్వంసం చేసిన వారాల వ్యవధిలోనే పనులు ప్రారంభించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
రాడార్లు గుర్తు పట్టకుండా టెర్రరిస్టుల క్యాంపుల నిర్మాణం
తాజాగా మళ్లీ నిర్మిస్తున్న శిబిరాల్లో లునీ, పుట్వాల్, టిపు పోస్టు, జమీల్ పోస్టు, ఉమ్రాన్వాలీ, చప్రార్ ఫార్వర్డ్, జంగ్ లోరా వంటి ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని శిబిరాలకు థర్మల్, రాడార్, ఉపగ్రహ సిగ్నళ్లను ఎలాంటి గుర్తింపు లేకుండా చేయడానికి టెక్నాలజీ పరికరాలు అమర్చుతున్నారు. కేల్, సర్దీ, దుధ్నియాల్, అత్ముకామ్, జూరా, లిపా, పచిబన్, కహుటా, కోట్లీ, ఖురాట్టా, మందర్, నికైల్, చమన్‌కోట్, జాంకోట్ వంటి ప్రాంతాల్లోనూ కొత్త శిబిరాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇవి దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాల్లో ఉండటంతో డ్రోన్‌లు, ఉపగ్రహాల నుండి కనిపించకుండ ఉండేలా చూస్తున్నారు.
బహవల్పూర్ లో టెర్రరిస్టులు రహస్య సమావేశం..
ఒక్కో శిబిరాన్ని చిన్నదిగా ఏర్పాటు చేసి, ఒక్కొక్కటిలో 200 మందికి మించని ఉగ్రవాదులే ఉంచే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి శిబిరానికి భద్రతా ఏర్పాట్లు, పాకిస్థాన్ ఆర్మీకి చెందిన ప్రత్యేకంగా శిక్షణ పొందిన సైనికులతో, థర్మల్ సెన్సర్లు, లో-ఫ్రీక్వెన్సీ రాడార్‌లు, డ్రోన్ కౌంటర్ పరికరాలతో కూడిన నిఘా వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక బహవల్పూర్‌లో ఇటీవల జరిగిన రహస్య సమావేశాన్ని భారత గూఢచార సంస్థలు గుర్తించాయి. జైష్, లష్కర్, హిజ్బుల్, (TRF) వంటి ఉగ్రవాద సంస్థల సీనియర్ కమాండర్లు, ISI అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. బహావల్పూర్ జైషే మహమ్మద్ ప్రధాన కేంద్ర నగరం. ఇది ఆపరేషన్ సిందూర్‌లో లక్ష్యంగా ఎంచుకున్న ప్రదేశాల్లో ఒకటి. ఈ సమావేశంలో నాయకత్వ మార్పులు, మళ్లీ శిబిరాల ఏర్పాటు, కొత్త రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లపై చర్చ జరిగినట్లు గుర్తించారు. ‘బహావల్పూర్ అమరవీరులు’ అనే పేరుతో బ్యానర్లు, పోస్టర్లు కనిపించగా, ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదులకు నివాళిగా ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని చూపించే వీడియోలో, తుపాకులతో ముసుగు పెట్టుకుని ఉన్న వ్యక్తులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ADB) వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి పాకిస్థాన్ కు వచ్చిన కొంత నిధిని ఈ ఉగ్ర శిబిరాల పునర్నిర్మాణానికి మళ్లిస్తున్నట్లు సమాచారం.
ఆపరేషన్ సిందూర్ – భారత్ ప్రతీకార దాడి
ఏప్రిల్ 22న పహల్గాం టెర్రర్ అటాక్‌లో 26 మంది మరణించడంతో, భారత ప్రభుత్వం ఈ దాడులకు ప్రతిగా ‘ఆపరేషన్ సిందూర్’ ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం నియంత్రణ రేఖను దాటకుండా, పాక్ ఆక్రమిత కశ్మీర్ పాక్‌లోని కొన్ని ప్రాంతాల్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసింది.ఈ దాడిలో స్వదేశీ డ్రోన్లు, లాంగ్ రేంజ్ గైడెడ్ మెషిన్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వినియోగించారు.పాకిస్థాన్ కి చైనా సరఫరా చేసిన వాయు రక్షణ వ్యవస్థలను భారత వాయుసేన జామ్ చేయగా, కేవలం 23 నిమిషాల్లో టార్గెట్లను భారత్ ధ్వంసం చేసింది. ఈ దాడికి (ISRO) ద్వారా పది ఉపగ్రహాల నుంచి వచ్చిన నిఘా సమాచారం కీలకంగా నిలిచింది.






