అమెరికాను తాకే రేంజ్ లో పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణుల తయారీ

by Shamantha N |

పాకిస్థాన్ అత్యంత గోప్యంగా అణ్వాయుధాలను తరలించే ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM) అభివృద్ధి చేస్తోంది.

అమెరికాను తాకే రేంజ్ లో పాకిస్థాన్ బాలిస్టిక్ క్షిపణుల తయారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్ అత్యంత గోప్యంగా అణ్వాయుధాలను తరలించే ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ మిస్సైల్ (ICBM) అభివృద్ధి చేస్తోంది. వాషింగ్టన్‌కు చెందిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ప్రకారం.. ఇవి అమెరికాను తాకే సామర్థ్యం కలిగి ఉండే అవకాశముందని ‘ఫారిన్ అఫైర్స్’ నివేదిక వెల్లడించింది. ఇటీవల భారతదేశం నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం, చైనా సహకారం ద్వారా పాకిస్థాన్ తన అణ్వాయుధ శక్తిని మెరుగుపరచాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ ICBMలను మెరుగుపర్చాలని చూస్తే దాన్ని ‘అణు వ్యతిరేక దేశం’ (nuclear adversary)గా పరిగణించాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

పాకిస్థాన్ అణు సామర్థ్యం.. కొత్త మలుపు

ఇప్పటి వరకు పాకిస్థాన్ భారత్ లో వివిధ ప్రాంతాలను ఢీకొట్టేలా షార్ట్, మిడియం రేంజ్ మిస్సైల్‌ల అభివృద్ధిపై దృష్టి పెట్టింది. అయితే ICBMలు 5,500 కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను ధ్వంసం చేయగలవు. ప్రస్తుతానికి పాకిస్థాన్ వద్ద ఇలాంటి ఏ మిస్సైల్‌ కూడా లేదు. కానీ 2022లో పరీక్షించిన షాహీన్-III మిస్సైల్ 2,700 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంది. ఇటీవల భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ లో తొమ్మిది ఉగ్ర శిబిరాలు, 11 విమాన స్థావరాలను ధ్వంసం చేసింది. దీనికి ప్రతిగా పాకిస్థాన్ హైపర్‌సోనిక్ మిస్సైల్ అయిన ఫతహ్-II ప్రయోగించగా భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు దాన్ని సమర్థంగా తిప్పికొట్టాయి.

సంక్షోభం నడుమ US ఆంక్షలు.. అణు భద్రతపై ఆందోళన

ఈ పరిణామాల నేపథ్యంలో, అమెరికా గత సంవత్సరం పాకిస్థాన్ పై బాలిస్టిక్ మిస్సైల్ ప్రోగ్రాం కారణంగా ఆంక్షలు విధించింది. నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్ సహా నాలుగు సంస్థలపై ఆంక్షలు ఉన్నాయి. పాకిస్థాన్ NPT (Nuclear Non-Proliferation Treaty) ఒప్పందానికి సంతకం చేయని దేశం. తాజాగా పాకిస్థాన్ చైనా సహాయంతో భారీ స్థాయిలో అణుశక్తి సామర్థ్యాన్ని పెంచుకుంటోందన్న విషయం వెలుగులోకి వచ్చింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా పలువురు మంత్రులు, పాకిస్థాన్ అణు ఆయుధాలను అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (IAEA) పర్యవేక్షించాలని కోరారు. పాకిస్థాన్ వద్ద అలాంటి ఆయుధాలు ఉంటే ఆ దేశాన్ని ఎప్పటికీ నమ్మలేమని రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

Next Story