- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. లీటర్ పెట్రోల్ పై భారీ తగ్గింపు!
ప్రజల నిరసనలు, ఆర్థిక సంక్షోభం నడుమ పాక్ ప్రభుత్వం ఇటీవల భారీగా పెరిగిన పెట్రోల్ ధరలను తగ్గించింది. ఈ మేరకు ప్రకటన చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్‌ను తీవ్ర ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభం, పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్ ధరను లీటరుకు 80 రూపాయలు తగ్గిస్తున్నట్లు ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శుక్రవారం అర్థరాత్రి ప్రకటించారు. ఈ తగ్గింపుతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర 378 రూపాయలకు (పాకిస్థాన్ కరెన్సీ) చేరుకుంది. పెట్రోలియం లెవీలో సర్దుబాటు చేయడం ద్వారా ప్రభుత్వం ఈ ఊరట కల్పించింది.
ఒక్క రోజులోనే యూ-టర్న్
మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు పెరిగాయని సాకు చూపుతూ.. కేవలం ఒక్క రోజు ముందే పాక్ ప్రభుత్వం ఇంధన ధరలను భారీగా పెంచింది. ఆ పెంపులో డీజిల్ ధరను 54.9% (రూ. 520.35కి), పెట్రోల్ ధరను 42.7% (రూ. 458.40కి) పెంచడం గమనార్హం. అయితే.. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ప్రభుత్వం దిగివచ్చి ఈ తగ్గింపును ప్రకటించింది.
సామాన్యులకు ప్రత్యేక సబ్సిడీ
ధరల భారంతో ఇబ్బంది పడుతున్న సామాన్యుల కోసం ఆర్థిక మంత్రి ఔరంగజేబ్ ప్రత్యేక ఉపశమన చర్యలు ప్రకటించారు. టూ వీలర్ వినియోగదారులకు లీటరుకు 100 రూపాయల సబ్సిడీ అందించనున్నారు. నెలకు గరిష్టంగా 20 లీటర్ల వరకు, మూడు నెలల పాటు ఈ సబ్సిడీ వర్తిస్తుంది. సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల నుంచి దిగుమతులపై ఆధారపడే పాకిస్థాన్.. అంతర్జాతీయ మార్కెట్‌లో స్వల్ప మార్పులు వచ్చినా తీవ్రంగా ప్రభావితమవుతోంది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల వల్ల గత నెలలో కూడా ఇంధన ధరలు 20% పెరిగాయి. వరుస పెంపులతో విసిగిపోయిన ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు కట్టి నిరసనలు తెలిపారు.






