Operation Sindhu : ఆపరేషన్ సింధు.. మరో 311 మంది భారతీయులు ఇరాన్ నుంచి రాక

by Muthe.Rajitha |

ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు(Iran-Israel War), ఇరాన్ పై అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం తన పౌరులను సురక్షితంగా ఇండియాకి తరలిస్తోంది.

Operation Sindhu : ఆపరేషన్ సింధు.. మరో 311 మంది భారతీయులు ఇరాన్ నుంచి రాక
X

దిశ, వెబ్ డెస్క్ : ఇరాన్‌- ఇజ్రాయెల్‌ ఉద్రిక్తతలు(Iran-Israel War), ఇరాన్ పై అమెరికా దాడుల నేపథ్యంలో భారత ప్రభుత్వం తన పౌరులను సురక్షితంగా ఇండియాకి తరలిస్తోంది. ఆపరేషన్ సింధు(Operation Sindhu)లో భాగంగా నేడు ఇరాన్‌లోని మష్షాద్ నగరం నుంచి 311 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం సాయంత్రం 4:30 గంటలకు (IST) న్యూఢిల్లీకి చేరుకుంది. దీంతో ఇప్పటి వరకు ఇరాన్ నుంచి తరలించిన భారతీయుల సంఖ్య 1,428కి చేరిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తన X ఖాతాలో పేర్కొన్నారు.

ఈ బృందంలో 280 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 200 మంది కాశ్మీరీ విద్యార్థులు ఉన్నారని J&K స్టూడెంట్స్ అసోసియేషన్ తెలిపింది. ఆపరేషన్ సింధు కార్యక్రమం.. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు తీవ్రమవడంతో భారతీయులను తరలించేందుకు చేపట్టబడింది. ఇరాన్ శుక్రవారం తన ఎయిర్‌స్పేస్ ఆంక్షలను సడలించి మష్షాద్ నుంచి మూడు చార్టర్డ్ విమానాలకు అనుమతి ఇచ్చింది. శుక్రవారం రాత్రి 290 మందితో మొదటి విమానం, శనివారం మధ్యాహ్నం 310 మందితో రెండో విమానం ఢిల్లీ చేరాయి. అంతకముందు గురువారం ఆర్మేనియా రాజధాని యెరెవాన్ నుంచి 110 మంది, శనివారం ఉదయం తుర్క్‌మెనిస్తాన్‌లోని అష్గాబట్ నుంచి మరో విమానం ఢిల్లీ చేరాయి.

భారత రాయబార కార్యాలయం తెహ్రాన్‌లో విద్యార్థులను కోమ్, మష్షాద్ వంటి సురక్షిత నగరాలకు తరలించి, అక్కడి నుంచి విమానాల్లో స్వదేశానికి పంపింది. కాగా నేపాల్, శ్రీలంక ప్రభుత్వాల అభ్యర్థన మేరకు వారి పౌరులను కూడా తరలిస్తున్నట్టు భారత రాయబార కార్యాలయం X ఖాతాలోలో పేర్కొంది. ఈ ఆపరేషన్‌లో ఇరాన్ విదేశాంగ మంత్రిత్వం సహకారం అందించిందని, భారతీయులను సొంత ప్రజలుగా భావిస్తున్నామని ఇరాన్ రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్ మొహమ్మద్ జవద్ హొస్సేనీ తెలిపారు.

Next Story