Nobel winner Yunus: బంగ్లాదేశ్ పీఎంగా నోబెల్ శాంతి గ్రహీత.. త్వరలోనే బాధ్యతలు చేపట్టే చాన్స్!

by vinod kumar |
Nobel winner Yunus: బంగ్లాదేశ్ పీఎంగా నోబెల్ శాంతి గ్రహీత.. త్వరలోనే బాధ్యతలు చేపట్టే చాన్స్!
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో రెండు నెలల పాటు సాగిన రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమం తీవ్ర అవడంతో ఆ దేశ ప్రధాన మంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అనంతరం ఆమె దేశం విడిచివెళ్లడంతో బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశ తాత్కాలిక ప్రధానిగా నోబెల్ శాంతి గ్రహీత మహమ్మద్ యూనిస్ బాధ్యతలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. యూనస్ నియామకానికి విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా అంగీకరించినట్టు సమాచారం. ఆర్మీ చీఫ్ వాకర్ ఉజ్ జమాన్ మంగళవారం నిరసన నాయకులతో సమావేశం కానున్నారు. ఈ భేటీ అనంతరం యూనస్‌ను ప్రధానిగా నియమించే చాన్స్ ఉంది. 18 మంది సభ్యులతో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తోంది.

యూనస్ నేపథ్యం?

యూనస్ బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో 1940 జూన్ 28న జన్మించారు. ఆయన ఒక బ్యాంకర్, ఆర్థికవేత్త, పౌర సమాజ నాయకుడిగా ఉన్నారు. మైక్రోక్రెడిట్, మైక్రో ఫైనాన్స్‌లో చేసిన మార్గదర్శక కృషికి గాను నోబెల్ శాంతి బహుమతిని అందుకున్నారు. దీంతో ఆయన అంతర్జాతీయ గుర్తింపును పొందాడు. నోబెల్ ప్రైజ్‌తో పాటు, యూనస్ 2009లో యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్, 2010లో కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్‌తో సహా అనేక ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. అలాగే 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి చాన్స్‌లర్‌గా పనిచేశారు. గతంలో చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. ఈ ఏడాది జనవరిలో కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు యూనస్‌కు కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

కర్ఫ్యూ తొలగింపు

బంగ్లాదేశ్‌లో 17 రోజుల కర్ఫ్యూ తర్వాత మంగళవారం దానిని ఎత్తేశారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, సెమీ గవర్నమెంట్, ఫ్యాక్టరీలు తెరుచుకుంటాయని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ తెలిపింది. జూలై 19న దేశంలో కర్ఫ్యూ విధించారు. మరోవైపు నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో మధ్యంతర ప్రభుత్వ రూపురేఖలు సిద్ధం చేస్తామని రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమ సమన్వయకర్త నహిద్ ఇస్లాం స్పష్టం చేశారు. దీంతో బంగ్లాదేశ్‌లో కొంత ఉద్రిక్త వాతావరణం తగ్గింది.



Next Story

Most Viewed