TG: భూముల ధరల పెంపు ఎఫెక్ట్.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పోటెత్తిన జనం

by Gantepaka Srikanth |

తెలంగాణ వ్యాప్తంగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువల పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

TG: భూముల ధరల పెంపు ఎఫెక్ట్.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద పోటెత్తిన జనం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువల పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పెరిగిన కొత్త ధరలు రేపటి నుంచే (జూన్ 5) అమలులోకి రానున్నాయి. బహిరంగ మార్కెట్లో ఉన్న ప్రస్తుత ధరలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ మార్కెట్ వ్యాల్యూస్ (Market Values) ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ హేతుబద్ధీకరణ (Rationalization) ప్రక్రియను ఇప్పటికే విజయవంతంగా పూర్తి చేసింది. ఐజీఆర్ఎస్ (IGRS) వెబ్సైట్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వారీగా అప్డేడేట్ చేసిన కొత్త ధరల డేటాను కూడా అధికారులు ఇప్పటికే అప్లోడ్ చేశారు. తాజా పెంపుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో స్థిరాస్తి ధరలు భారీగా పెరగనున్నాయి. వ్యవసాయ భూములు, వ్యవసాయేతర స్థలాలు (ప్లాట్లు), ఇండ్లు, అపార్టుమెంట్లు (ఫ్లాట్లు), ఇలా అన్ని కేటగిరీల రిజిస్ట్రేషన్ విలువలనూ ప్రభుత్వం సవరించింది. దీంతో రేపటి నుండి రిజిస్ట్రేషన్ చేయించుకునే వారు పెరిగిన మార్కెట్ ధరల ప్రకారం అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల వద్ద రద్దీ.. పెరిగిన పనివేళలు:

రేపటి నుండి ధరలు పెరుగుతుండటంతో, పాత ధరలకే రిజిస్ట్రేషన్లు ముగించుకోవాలని కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. దీంతో ఈరోజు (జూన్ 4) తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద కొనుగోలుదారులు, డాక్యుమెంట్ రైటర్లతో అసాధారణ రద్దీ నేలకొంది. చలాన్లు కట్టేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు జనం పోటెత్తారు. కార్యాలయాల వద్ద ఉన్న రద్దీని, ప్రజల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సజావుగా సాగడం కోసం ఈరోజు రాత్రి 7:30 గంటల వరకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల పనివేళలను పెంచుతూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. టోకెన్లు పొందిన వారందరికీ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించింది.

Next Story