తొలకరి వర్షానికి పులకించిన పుడమితల్లి.. రైతన్నల హర్షం

by Jakkula.Mamatha |

గత మూడు నెలలుగా మాడు పగిలే వానకు తల్లడిల్లిన పుడమి తల్లి గురువారం ఒక్కసారిగా మారిన వాతావరణానికి కురుస్తున్న వాన చినుకులకు పులకించిపోయింది.

తొలకరి వర్షానికి పులకించిన పుడమితల్లి.. రైతన్నల హర్షం
X

దిశ,హుజూరాబాద్: గత మూడు నెలలుగా మాడు పగిలే వానకు తల్లడిల్లిన పుడమి తల్లి గురువారం ఒక్కసారిగా మారిన వాతావరణానికి కురుస్తున్న వాన చినుకులకు పులకించిపోయింది. ఎండలతో పగిలిన భూమి, వాలిపోయిన చెట్లు, ఒక్కసారిగా కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. ప్రతి రోజూ ఆకాశం వైపు చూస్తూ “ఈసారైనా తొలకరి పడుతుందా?” అని గుసగుసలాడే రైతులకు కురిసిన వర్షం రాబోయే కాలానికి నమ్మకాన్ని కలిగించాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత పడమటి దిక్కున నల్లని మేఘాలు మెల్లగా కదిలాయి. గాలి చల్లబడింది. గాలికి చెట్ల ఆకులు సరసరా అన్నాయి. కాకులు గుంపులు గుంపులుగా ఎగురుతూ “వర్షం వస్తుంది, వర్షం వస్తుంది” అన్నట్టు అరిచాయి.

అప్పుడే ఉరుములతో కూడిన మొదటి చినుకు పడింది. ఎండిన మట్టి మీద పడిన ఆ చినుకు ఒక్క క్షణం ఆగి, భూమిలోకి ఇంకిపోయింది. మట్టి వాసన వచ్చింది. ఈ వాసనకు ఒక్కసారిగా రైతులంతా పులకించిపోయారు. ఆ తర్వాత ఉరుములు, మెరుపులతో దాదాపు గంట పాటు జోరుగా వర్షం కురిసింది. తొలకరి వర్షం అంటే కేవలం నీళ్లు కాదు. అది ఆశ, నమ్మకం అంటూ రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరద వచ్చే వాన కాకున్నా ప్రస్తుతం కురుస్తున్న జోరు వానకు వాతావరణం ఒక్కసారిగా మారిపోయి చల్లదనాన్ని ఇస్తుంది.

Next Story