ఉక్కపోతకు బ్రేక్.. మానకొండూరులో ఈదురుగాలులతో భారీ వర్షం!

by Jakkula.Mamatha |   (  Updated:2026-06-04 11:52:38  IST  )

గత కొన్ని నెలలుగా భానుడి భగభగలకు, తీవ్రమైన ఉక్కపోతకు అల్లాడిపోతున్న కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది.

ఉక్కపోతకు బ్రేక్.. మానకొండూరులో ఈదురుగాలులతో భారీ వర్షం!
X

దిశ,మానకొండూరు: గత కొన్ని నెలలుగా భానుడి భగభగలకు, తీవ్రమైన ఉక్కపోతకు అల్లాడిపోతున్న కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. గురువారం సాయంత్రం నియోజకవర్గంలోని పలు మండల కేంద్రాలతో పాటు పరిసర గ్రామాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గత మూడు నెలలుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావడానికే జనం భయపడ్డారు. రాత్రి వేళల్లో కూడా విపరీతమైన ఉక్కపోతతో నలిగిపోయిన ప్రజలకు ఈ వర్షం పెద్ద ఊరటనిచ్చింది. సాయంత్రం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై, బలమైన ఈదురు గాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ప్రారంభమైంది.

మండలాల్లో చల్లటి వాన ముసురు..

నియోజకవర్గ కేంద్రమైన మానకొండూరుతో పాటు తిమ్మాపూర్, గన్నేరువరం,కేశపట్నం తదితర మండలాల్లోనూ విస్తారంగా వర్షం కురిసింది. రోడ్లన్నీ అక్కడక్కడ జలమయం కాగా, ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా చల్లబడింది.

ప్రజల్లో వెల్లివిరిసిన ఆనందం..

దీర్ఘకాలిక ఉక్కపోత తర్వాత ఒక్కసారిగా వాతావరణం ఆహ్లాదకరంగా మారడంతో నియోజకవర్గ ప్రజల్లో, ముఖ్యంగా చిన్నారులు, వృద్ధుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.అటు ఈ ముందస్తు వర్షాలు వ్యవసాయ పనులకు అనుకూలంగా ఉంటాయని భావిస్తూ రైతాంగం కూడా హర్షం వ్యక్తం చేస్తోంది. అయితే, అక్కడక్కడ ఈదురు గాలుల ధాటికి చెట్లు విరిగిపడి, విద్యుత్ సరఫరాకు స్వల్ప అంతరాయం ఏర్పడింది.

Next Story