టేకు చెట్ల అనుమతికి ‘రేటు’.. కొడిమ్యాల అటవీ అధికారికి ఏసీబీ షాక్!?

by Jakkula.Mamatha |

టేకు చెట్ల నరికివేత, రవాణా అనుమతుల పేరుతో లంచం డిమాండ్ చేసిన కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు.

టేకు చెట్ల అనుమతికి ‘రేటు’.. కొడిమ్యాల అటవీ అధికారికి ఏసీబీ షాక్!?
X

దిశ,కొడిమ్యాల: టేకు చెట్ల నరికివేత, రవాణా అనుమతుల పేరుతో లంచం డిమాండ్ చేసిన కొడిమ్యాల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏసీబీ అధికారుల వలలో చిక్కారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల రేంజ్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన ట్రాప్‌లో ఎఫ్‌ఆర్‌వో గులాం మొయినుద్దీన్‌ను ఏసీబీ కరీంనగర్ యూనిట్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఫిర్యాదుదారుడికి 120 టేకు చెట్ల నరికివేతకు, వాటి రవాణాకు అనుమతి మంజూరు చేయడం కోసం మొదట రూ.2 లక్షల లంచం కోరిన అధికారి, గతంలోనే రూ.1 లక్ష తీసుకున్నాడు. అధికారిక ప్రక్రియ పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తాన్ని రూ.80 వేలకు తగ్గించి, గురువారం తన కార్యాలయంలో తీసుకున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఎఫ్ఆర్ఓ టేబుల్ డ్రాయర్‌లో ఉంచిన రూ.80 వేల లంచం నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించాల్సిన అధికారి, వాటిని ఆదాయ మార్గంగా మార్చుకున్నాడని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని కరీంనగర్‌లోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.ఇక్కడ అధికారులు తిరుపతి, శ్రీకాంత్ పాల్గొన్నారు. లంచం అడిగితే 1064కు సమాచారం ఇవ్వాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, స్వీకరించినా వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని స్పష్టం చేశారు.

Next Story