- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
44 వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు దుర్మరణం
డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44 వ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని 44 వ జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. జక్రాన్ పల్లి మండలం ఇందిరానగర్ కాలనీకి చెందిన బలరాం(26), నవీన్(20) లనే ఇద్దరు యువకులు బుల్లెట్ బైక్ పై కామారెడ్డి నుంచి తమ స్వగ్రామానికి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వారు నడుపుతున్న బుల్లెట్ బైక్ డిచ్ పల్లి మండలం నాగాపూర్ గేట్ సమీపంలో తమ ముందు వెళుతున్న కారును ఢీకొంది. దీంతో వారిద్దరూ బైక్ పై నుండి ఎగిరి రోడ్డు మీద పడ్డారు. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న ఓ భారీ కంటెయినర్ వారిద్దరి పై నుంచి దూసుకెళ్లడంతో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదంలో బుల్లెట్ కూడా నుజ్జు నుజ్జయింది. సమాచారం తెలుసుకున్న డిచ్ పల్లి సీఐ వినోద్, ఎస్ఐ షరీఫ్ లు తమ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డు పై పడి ఉన్న యువకుల మృతదేహాలను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదాలు ఎక్కువ జరిగే ప్రదేశాల్లో సైన్ బోర్డులు, స్పీడ్ బ్రేకర్ లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన తీరును స్థానిక పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్న కమిషనర్ సాయిచైతన్య జాతీయ రహదారి అధికారులు, రవాణాశాఖ అధికారులు, పోలీసు అధికారులతో మాట్లాడారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాదకర మలుపుల వద్ద రిఫ్లెక్టర్లు, సైన్‌బోర్డులు, స్పీడ్ నియంత్రణ సూచికలు ఏర్పాటు చేయడం, రాత్రి సమయంలో వాహనదారులకు స్పష్టంగా కనిపించే విధంగా వెలుతురు సదుపాయాలు కల్పించడం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. రహదారిపై వాహనాల అతివేగాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీపీ అధికారులకు సూచించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనాలను అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపరాదని , ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని , సురక్షిత ప్రయాణానికి అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్, డిచ్ పల్లి సీఐ వినోద్, డిచ్ పల్లి ఎస్సై ఆరిఫ్ అధికారులు పాల్గొన్నారు.






